ఇటీవల పంజాబ్ (Punjab)లో సంభవించిన భారీ వరదలతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా, వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. అనేకమంది తమ జీవనోపాధిని కోల్పోగా, భారీ సంఖ్యలో పశువులు మరణించాయి. ఈ సంక్షోభ సమయంలో, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (Shah Rukh) తన దాతృత్వాన్ని చాటుకున్నారు. బాధితులకు సాయం అందించేందుకు ఆయన స్థాపించిన మీర్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి పంజాబ్‌లోని వరద బాధితులకు సహాయం చేస్తోంది.
మీర్ ఫౌండేషన్ తరపున, వరద బాధితులకు అవసరమైన సహాయ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఈ కిట్లలో మందులు, పరిశుభ్రత వస్తువులు, ఆహార పదార్థాలు, దోమతెరలు, టార్పాలిన్ షీట్లు, మడతపెట్టే పడకలు, కాటన్ పరుపులు, ఇతర ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. అమృత్‌సర్, పాటియాలా, ఫాజిల్కా, ఫిరోజ్‌పూర్ వంటి జిల్లాల్లోని మొత్తం 1,500 కుటుంబాలకు ఈ సహాయం అందుతోంది. ప్రజల తక్షణ ఆరోగ్యం, భద్రత మరియు ఆశ్రయం అవసరాలను తీర్చడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ “దేవుడు మీ అందరికీ తోడుగా ఉంటాడు” అని ట్వీట్ చేశారు.