ఇటీవల ఏపీలో వింత వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటి వరకు బెల్ట్ షాపుల కోసం లక్షల్లో జరిగిన వేలాలు ఇప్పుడు ఉద్యోగాల వరకు చేరాయి. ప్రతిభ, పనితనంతో లేదంటే ఎవరైనా ప్రభుత్వ పెద్దల సిఫార్సుతో చేయించుకుంటేనో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విభాగాల్లో ఉద్యోగాలు దక్కుతాయి. కానీ, శ్రీకాకుళం జరిగిన సంఘటన గురించి తెలిస్తే ఆశ్చర్యానికి గురవ్వక తప్పదు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం లక్కవరం గద్దెలపాడులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఏకంగా వేలంపాట నిర్వహించారు. గ్రామంలోని అంగన్‌వాడీ, ఆశా, రేషన్ డీలర్, మధ్యాహ్న భోజనం పథకం, సీఎఫ్ వంటి పోస్టులకు వేలం వేలంపాట నిర్వహించారు. ఒక్కో పోస్ట్‌కు ఇంతని రేట్ ఫిక్స్ చేసి మరీ వేలంపాట నిర్వహించారు.
ఈ వేలంలో ఏకంగా రూ.లక్షా 90వేలకు ఆశావర్కర్ పోస్ట్‌ను గ్రామపెద్దలు అమ్మేశారు. 2014 నుంచి విధులు ఆశావర్కర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రమ్మను ఆ పోస్ట్‌కు రిజైన్ చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. డబ్బులు కట్టేందుకు నిరాకరించడంతో ఆశావర్కర్ చంద్రమ్మను గ్రామ పెద్దలంతా కలిసి సంఘ బహిష్కరణ చేశారు. ఆశావర్కర్ చంద్రమ్మ కుటుంబంతో ఎవరూ మాట్లాడవద్దంటూ గ్రామంలో దండోరా వేయించారు.
ఆశా వర్కర్ చంద్రమ్మ యూనియన్ నేతలతో కలిసి గ్రామ పెద్దల తీరుపై డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (DMHO)ను కలిసి ఫిర్యాదు చేశారు. అదే విధంగా శ్రీకాకుళం కలెక్టర్ తో పాటు మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానని బాధితురాలు స్పష్టం చేశారు.








