కర్ణాటక రాష్ట్రంలో ఒక కీలక సంఘటన వెలుగు చూసింది. తుమకూరు జిల్లాలోని డీఎస్పీ ఆఫీసుకు భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై డీఎస్పీ రామచంద్రప్ప అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ సంఘటన తుమకూరు జిల్లా మధుగిరి డివిజన్‌లో జరిగింది. పావగడకు చెందిన బాధిత మహిళ తనకున్న భూమి సమస్యను తెలియజేయడానికి డీఎస్పీ ఆఫీసుకు చేరుకుంది. కానీ, తాను ఎదుర్కొన్నది న్యాయం కాదని, తాను లైంగిక వేధింపుల బారిన పడినట్లు ఆరోపణలు చేశారు. సంబంధిత ఘటన వీడియో రూపంలో రహస్యంగా రికార్డ్ చేయడం, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
చర్యలపై ప్రశ్నలు
ఈ సంఘటన కర్ణాటక హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్ సొంత జిల్లాలో చోటుచేసుకోవడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఈ వీడియో బయట పడిన తర్వాత సంబంధిత డీఎస్పీ కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. డీఎస్పీపై చర్యలు తీసుకొని బాధిత మహిళకు న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.