సముద్రం ఉగ్రరూపం దాల్చింది. విరుచుకుపడుతున్న కెరటాలు తీరంలో తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరప్రాంతంలో సముద్రం మళ్లీ ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. ఎగసిపడుతున్న కెరటాలు తీరప్రాంత ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతున్నాయి. సుబ్బంపేట పేట ప్రాంతంలో అలల తాకిడికి బీచ్ రోడ్డు ధ్వంసం అవుతోంది. తరచుగా అలల ఒత్తిడితో రోడ్డు పైభాగం కూలిపోతుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
తీరంలో అలలు సృష్టిస్తున్న బీభత్సానికి సుబ్బంపేట ప్రాథమిక పాఠశాల ప్రాంగణం వరకు సముద్రపు నీరు చేరింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల భద్రత కోసం అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సముద్రం గాలివానల ప్రభావంతో పోటు మీద ఉండటంతో తీరప్రాంతంలో అలజడి పెరిగింది. ఈ పరిస్థితి కొనసాగితే మరిన్ని ఇళ్లు, రహదారులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పాడ తీరప్రాంతంలో ఇలాంటి సమస్యలు తరచుగా ఎదురవుతుండటంతో శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.