జర్మనీలో క్రిస్మస్ పండుగకు ముందు మాగెబర్గ్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. క్రిస్మస్ హాలిడే మార్కెట్‌లో షాపింగ్ చేస్తోన్న జనాలపైకి ఒక కారు వేగంగా దూసుకువచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, 68 మంది గాయపడ్డారు. వారిలో 15 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించి ఎమర్జెన్సీ టీమ్‌ను రంగంలోకి దింపారు. 100 ఫైర్ ఫైటర్స్ రంగప్రవేశం చేసి పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించారు. ఇది సాధారణ ప్రమాదం కాదని, టెర్రరిస్టు దాడిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.