సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తన రాబోయే చిత్రం ‘స్పిరిట్’ (Spirit) స్టోరీ లీక్ (Story Leak) నేపథ్యంలో ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో ఆయన ఎవరి పేరునూ ప్రస్తావించకుండా, ఒక నటి తన కథను బయటపెట్టి, యువ నటిని కించపరిచారని ఆరోపిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్ట్ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone)పై పరోక్షంగా గురిపెట్టినట్లు భావిస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా తన ఎక్స్ పోస్ట్‌లో ఇలా రాశారు: “నేను ఒక కథ ఓ యాక్టర్‌కు నరేట్ చేసేటప్పుడు, 100% నమ్మకం ఉంచుతాను. కథను బయట ఎక్కడా చెప్పకూడదనే అగ్రిమెంట్ (Agreement) ఉంటుంది. కానీ ఇలా చేయడం ద్వారా, నీవు నీ వ్యక్తిత్వాన్ని ‘బయటపెట్టావు’… ఒక యువ నటిని కించపరచడం, నా కథను బయటపెట్టడం? ఇదేనా నీ ఫెమినిజం? నా కళ వెనుక సంవత్సరాల కఠిన శ్రమ ఉంది. నీవు దీన్ని అర్థం చేసుకోలేదు, ఎప్పటికీ చేసుకోలేవు” ఈసారి పూర్తి స్టోరీ చెప్పేయ్.. నాకు తేడా ఉండదంటూ సందీప్ ఫైర్ అయ్యారు. డర్టీPRగేమ్స్ అనే హ్యాష్‌ట్యాగ్స్‌తో ట్వీట్ చేశారు.
ఈ పోస్ట్ దీపికా పదుకొణె ‘స్పిరిట్’ చిత్రం నుండి తప్పుకోవడం, ఆమె స్థానంలో ట్రిప్టీ డిమ్రీని (Tripti Dimri) తీసుకోవడం వంటి సంఘటనల నేపథ్యంలో వచ్చినట్లుగా తెలుస్తోంది. దీపికా తన వ్యక్తిగత జీవితం, సినిమాలోని A-రేటెడ్ సన్నివేశాలపై అసౌకర్యం కారణంగా స్పిరిట్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, ఆమె బృందం నుండి ‘స్పిరిట్’ కథలోని కొన్ని వివరాలను మీడియాకు లీక్ చేసి, ట్రిప్టీ డిమ్రీని కించపరిచేలా పీఆర్ వ్యూహాలు అనుసరించినట్లు సందీప్ ఆరోపించారు.
సోషల్ మీడియాలో ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు సందీప్ రెడ్డి వంగా వైఖరిని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఆయన వ్యాఖ్యలు దీపికాపై వ్యక్తిగత దాడిగా భావిస్తున్నారు. “ఇది సందీప్ వంగా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న వివాదాస్పద వ్యూహమే” అని కొందరు నెటిజన్లు విమర్శించారు. ట్రిప్టీ డిమ్రీ ఈ ప్రాజెక్ట్‌లో చేరినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ “ఈ ప్రయాణంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. సందీప్ రెడ్డి వంగాకి ధన్యవాదాలు” అని పోస్ట్ చేశారు. ‘స్పిరిట్’ చిత్రం ప్రభాస్ ప్రధాన పాత్రలో, టీ-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కనుంది. ఈ వివాదం సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది, అయితే దీపికా బృందం నుండి ఇంకా అధికారిక స్పందన రాలేదు.