పీఏ ముఖ్య‌మా..? టీడీపీ సీనియ‌ర్‌ను లెక్క‌చేయ‌ని మంత్రి!

పీఏ ముఖ్య‌మా..? టీడీపీ సీనియ‌ర్‌ను లెక్క‌చేయ‌ని మంత్రి!

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు తెలుగుదేశం పార్టీలో రాజకీయ సెగలు తారాస్థాయికి చేరాయి. సొంత పార్టీలోనే మంత్రికి, మాజీ ఎమ్మెల్యేకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలు భగ్గుమన్నాయి. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ సతీష్‌పై నమోదైన అత్యాచారం కేసు.. ఇప్పుడు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.పి. భంజ్‌దేవ్‌ ఇంటి వరకు పోలీసులను తీసుకెళ్లడం నియోజకవర్గంలో సంచలనంగా మారింది.

అసలేం జరిగింది?
మంత్రి సంధ్యారాణి పీఎస్ సతీష్‌పై ఒక మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మొదలైంది. అయితే, బాధితురాలు భంజ్‌దేవ్‌తో ఫోన్‌లో మాట్లాడిందని, ఈ కేసు వెనుక ఆయన కుట్ర ఉందనే అనుమానంతో బుధవారం పోలీసులు నేరుగా భంజ్‌దేవ్ స్వగృహానికి వెళ్లి విచారణ జరిపారు. కాల్ డేటా ఆధారంగా పోలీసులు ప్రశ్నించడంపై భంజ్‌దేవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

భంజ్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు
పోలీసుల విచారణ అనంతరం భంజ్‌దేవ్ మీడియా ముందు నిప్పులు చెరిగారు. ఆయన మాటల్లోనే.. “42 ఏళ్ల రాజకీయం. ఇలాంటి విచారణ ఎప్పుడూ చూడలేదు” మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన తనపై, అధికార పార్టీలోనే ఉండి పోలీసు విచారణ ఎదుర్కోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి పీఏ చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సీనియర్ నాయకులను అవమానిస్తారా? అని ప్రశ్నించారు. ఇది మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేయిస్తున్న కక్ష సాధింపు చర్యేనని ఆయన పరోక్షంగా ఆరోపించారు. బాధితులు తనకు ఫోన్ చేయడం సహజమని, పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే మంత్రిని కలిసి పరిష్కరించుకోమని బాధితురాలికి చెప్పానన్నారు. పైగా సీఎంవో ఆదేశాల మేరకు అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ నాగేశ్వరరావు చెప్పబట్టే బాధితురాలితో మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు.

అధిష్టానం వద్దకు పంచాయితీ!
సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, పోలీసు విచారణల వరకు వెళ్లడం సాలూరు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని భంజ్‌దేవ్ స్పష్టం చేశారు. మంత్రి తీరుపై క్యాడర్‌లో కూడా చర్చ మొదలైంది. మరి ఈ అంతర్గత పోరును పార్టీ అధిష్టానం ఎలా చక్కదిద్దుతుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment