బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీకి అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ స్పై మ్యూజియం (వాషింగ్టన్ డీసీ)లో బెస్ట్ మూవీగా ‘ఏక్ థా టైగర్’ మూవీ పోస్టర్ ప్రదర్శించబడింది. భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక సినిమా ఏక్ థా టైగర్. థియేటర్లలో విడుదలైన పదమూడు సంవత్సరాల తర్వాత ఈ ప్రత్యేకమైన అంతర్జాతీయ గౌరవాన్ని ఈ సినిమా దక్కించుకుంది. ఇది భారతీయ సినిమాకు గర్వకారణం అని చెప్పొచ్చు.
అరుదైన గౌరవంతో జేమ్స్ బాండ్, మిషన్: ఇంపాజిబుల్, మెన్ ఇన్ బ్లాక్ వంటి ఐకానిక్ గ్లోబల్ స్పై ఫ్రాంచైజీల సరసన ఏక్ థా టైగర్ నిలిచింది. ఇంటర్నేషనల్ స్పై మ్యూజియంలో ఐకానిక్ స్పై సినిమాలు, టెలివిజన్ సిరీస్‌లకు ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది. ఇందులో దాదాపు 25 ప్రసిద్ధ అంతర్జాతీయ టైటిల్స్ పోస్టర్లు ప్రదర్శించబడతాయి. క్యాసినో రాయల్, మిషన్: ఇంపాజిబుల్, స్పై గేమ్, టింకర్ టైలర్ సోల్జర్ స్పై, సెవెన్టీన్ మూమెంట్స్ ఆఫ్ స్ప్రింగ్, OSS 117, G మెన్, ది ఇమిటేషన్ గేమ్, మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్, బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్, హోమ్‌ల్యాండ్, అలియాస్, ఫౌడా, ది ప్రిజనర్, గెట్ స్మార్ట్, మెన్ ఇన్ బ్లాక్, ది సీజ్, టర్న్: వాషింగ్టన్స్ స్పైస్, ది మ్యాన్ ఫ్రమ్ అంకుల్ వంటి సినిమాలు, షోలతో ఏక్ థా టైగర్ పోస్టర్‌ను ప్రదర్శించారు.
అరుదైన గౌరవంపై దర్శకుడు కబీర్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. సినిమా విజయాన్ని బాక్సాఫీసు కలెక్షన్లు మాత్రమే నిర్ణయించలేవని, ప్రేక్షకులకు ఎంత కాలం గుర్తున్నదనేది కూడా ముఖ్యం అని పేర్కొన్నారు. ఇప్పటికీ ఈ చిత్రం గురించి మాట్లాడుతుండటం ఆనందంగా ఉందన్నారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో రూపొందిన తొలి చిత్రం ఏక్ థా టైగర్. 2012 ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమాలో రా ఏజెంట్‌గా సల్మాన్ ఖాన్, ఐఎస్‌ఐ. ఏజెంట్‌గా కత్రినా కైఫ్ నటించారు. రూ.75 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. రూ.330 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.