మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రులు అనిత (Anitha), సవిత (Savita)లకు సవాల్ విసిరారు. వైఎస్ జగన్(YS Jagan) హయాంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను (Medical Colleges) చూసేందుకు రావాలని, వాటి నిర్మాణం గురించి మాట్లాడే అర్హత కూటమి నేతలకు లేదని రోజా స్పష్టం చేశారు.
నగరిలో మీడియాతో మాట్లాడుతూ రోజా పలు అంశాలపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన “సూపర్ సిక్స్”(Super Six) హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలు తమకు ఓట్లు వేసి తప్పు చేశామని భావిస్తున్నారని అన్నారు. అలాగే, చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని, కానీ వైఎస్ జగన్(Ys Jagan) మాత్రం తొలిసారే 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి, వాటిలో ఆరింటిని ప్రారంభించారని రోజా గుర్తు చేశారు.
మంత్రులపై విమర్శలు
మంత్రులు అనిత, సవితలపై రోజా తీవ్రంగా మండిపడ్డారు. హోం మంత్రి అనిత మహిళల భద్రత గురించి మాట్లాడకుండా కేవలం వైఎస్ జగన్‌ను విమర్శించడానికి ఫేక్ వీడియోలు ప్రదర్శించారని ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, పీపీపీ(PPP) అంటే ప్రైవేటీకరణ కాదని అనిత చెప్పడంపై రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొత్త మంత్రి సవితకు మెడికల్ కాలేజీల నిర్మాణంపై కనీస అవగాహన కూడా లేదని, ఆమె తన సొంత ప్రాంతంలోనే ఒక మెడికల్ కాలేజీని పూర్తి చేయించలేకపోయారని ఎద్దేవా చేశారు.
రోజా సవాల్
తాను రాజమండ్రి, విజయనగరం, పాడేరు, నంద్యాల, మచిలీపట్నం మెడికల్ కాలేజీల దగ్గరకు వస్తానని, దమ్ముంటే మంత్రులు కూడా అక్కడికి వచ్చి వైఎస్ జగన్ పూర్తి చేసిన కాలేజీలను చూడాలని రోజా సవాల్ చేశారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి శూన్యమని, కేవలం అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చారని ఆమె విమర్శించారు. ఒక మెడికల్ కాలేజీ పూర్తి కావడానికి ఏడేళ్లు పడుతుందని, అయినా జగన్ వేగంగా పనులు పూర్తి చేశారని రోజా తెలిపారు.
ఇతర అంశాలపై విమర్శలు
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు యూరియా కూడా అందించలేకపోయారని, ముందు తన శాఖను చూసుకోవాలని రోజా సూచించారు. చంద్రబాబు 15 నెలల్లోనే లక్షా 97 వేల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌కి ఓట్లు వేసింది షూటింగ్‌లు చేసుకోవడానికి కాదని, ప్రజలు ఇప్పుడు ఆయనకు ఓటు వేసినందుకు సిగ్గుపడుతున్నారని ఎద్దేవా చేశారు.