‘రేవంత్ రెడ్డి గారూ.. మీరు తెలంగాణ‌ ముఖ్యమంత్రా? టీడీపీ కార్య‌క‌ర్తా?’

'రేవంత్ రెడ్డి గారూ.. మీరు తెలంగాణ‌ ముఖ్యమంత్రా? టీడీపీ కార్య‌క‌ర్తా?'

తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) అవలంబిస్తున్న అప్రజాస్వామిక ధోరణి, అలాగే ఆయన ఉపయోగిస్తున్న అదుపులేని భాషపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC) డాక్టర్ శ్రవణ్ దాసోజు (Dr. Sravan Dasoju) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రిని ఉద్దేశించి బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో సీఎం వైఖరిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

హింసాత్మక పదజాలం.. క్రిమినల్ కుట్ర
ముఖ్యమంత్రి హోదాలో ఉండి ‘పాతిపెట్టండి’, ‘బొంద పెట్టండి’, ‘దిమ్మలు కూల్చండి’ వంటి హింసాత్మక పదాలను బహిరంగ సభల్లో వాడటం దారుణమని శ్రవణ్ దాసోజు విమర్శించారు. ఇవి రాజకీయ విమర్శలు కావని, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రమాదకరమైన చర్యలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిలా కాకుండా ఫ్యాక్షన్ ముఠా నాయకుడిలా ప్రవర్తిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు తెలంగాణలో బీఆర్ఎస్ దిమ్మలు కూల్చడానికి, ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అని తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడడంపై వివాదంగా మారింది.

కాంగ్రెస్ జెండా.. టీడీపీ అజెండా
రేవంత్ రెడ్డి రాజకీయ తీరుపై విస్మయం వ్యక్తం చేసిన శ్రవణ్, “అధికారం కాంగ్రెస్‌ది అయినా, ఆత్మ మాత్రం టీడీపీదే(TDP)” అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జెండా కప్పుకుని, లోపల తన పాత రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు అజెండాను అమలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీని మళ్లీ రాజకీయంగా లేపే ‘ప్లాన్-బి’లో భాగంగానే ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయని, ఇది రాజకీయ వ్యభిచారానికి సమానమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సొంత పార్టీ సీనియర్ల అణిచివేత
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను క్రమంగా బలహీనపరుస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ఈ విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. ఒకవైపు ఢిల్లీ అధిష్టానాన్ని మోసం చేస్తూ, మరోవైపు టీడీపీ, బీజేపీలతో కోవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

ఆర్థిక అవగాహన లేని డొల్ల వాగ్దానాలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారుతున్నా, సంపద సృష్టించే స్పష్టమైన విధానం లేకుండా ‘ఫ్యూచర్ సిటీ’, ‘5 ట్రిలియన్ ఎకానమీ’ అంటూ ప్రజలకు రంగుల కలలు చూపిస్తున్నారని మండిపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగులకు కనీస బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉండి, భారీ మాటలు మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌నే తెలంగాణ జాతిపిత
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వస్వం త్యాగం చేసిన కేసీఆర్ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ‘తెలంగాణ జాతిపిత’గా నిలిచిపోతారని శ్రవణ్ దాసోజు స్పష్టం చేశారు. అలాంటి నాయకుడిని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీని తూలనాడటం సూర్యుడిపై ఉమ్మివేయడమేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “అధికారం శాశ్వతం కాదు. అహంకారమే మీ వినాశనానికి కారణమవుతుంది” అంటూ రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని శ్రవణ్ దాసోజు హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తగిన సమయంలో ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment