తెలంగాణ ప్రభుత్వం మరోసారి భూముల వేలం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గ్‌లోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 18.67 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.
ఎకరాకు రూ.101 కోట్లు కనీస ధరగా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) ప్రకటించింది. ఈ ధరకే భూమి అమ్ముడైతే, ప్రభుత్వానికి సుమారు రూ.1900 కోట్లు ఆదాయం వస్తుంది. ఒకవేళ వేలంలో పోటీ పెరిగితే, ఆదాయం మరింత ఎక్కువగా ఉండవచ్చు.
గత నెలలో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ)కి చెందిన 7.8 ఎకరాలను ప్రభుత్వం ఈ-వేలం ద్వారా విక్రయించింది. ఆ వేలంలో ఎకరం రూ.70 కోట్లు పలికింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ ఈ భూమిని కొనుగోలు చేయగా, ప్రభుత్వానికి రూ.547 కోట్లు ఆదాయం వచ్చింది. ఆ వేలం కోసం గోద్రెజ్‌తో పాటు అరబిందో రియల్టీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ వంటి ప్రముఖ సంస్థలు పోటీపడ్డాయి. అప్పుడు ఎకరాకు కనీస ధరను రూ.40 కోట్లుగా నిర్ణయించారు. అంతకుముందు కూడా భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించింది.