‘ఎస్సీ వ్య‌క్తి డీజీపీ కాకూడ‌ద‌నే స‌స్పెన్ష‌న్’ – ఆర్ఎస్ ప్ర‌వీణ్ సంచ‌ల‌న ట్వీట్‌

'ఎస్సీ వ్య‌క్తి డీజీపీ కాకూడ‌ద‌నే స‌స్పెన్ష‌న్' - ఆర్ఎస్ ప్ర‌వీణ్ సంచ‌ల‌న ట్వీట్‌

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 2020 నుండి 2024 మధ్య పలుమార్లు విదేశాలకు వెళ్లి, ఆలిండియా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్ర‌భుత్వం ఆరోప‌ణ‌లు చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్‎గా పీవీ సునీల్ కుమార్ కీలకంగా వ్యవహరించారు.

కూట‌మి ప్ర‌భుత్వ చ‌ర్చ‌పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు ఆర్.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. సునీల్ కుమార్ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, ఆయన డీజీపీ అవుతారనే భయంతోనే సస్పెండ్ చేశారని ఆరోపించారు. సునీల్ కుమార్ వ్యక్తిగత సెలవుకు అప్లై చేసినప్పుడే తాను విదేశాలకు వెళ్తున్నట్లు తెలిపారన్నారు. తాను వీసా తీసుకొని విదేశాలకు పోతున్నానని, అప్పుడు ఆయనకు ప‌ర్మిష‌న్ (Ex-India Leave GO) ఇచ్చింది మీ ప్రభుత్వాలే కదా? అప్పుడు లేని రూల్స్ ఇప్పుడెందుకు సడన్‌గా వ‌చ్చాయ‌ని ప్ర‌శ్నించారు.

కండక్ట్ రూల్స్‌ను కచ్చితంగా అమలు చేస్తే సగం మంది సివిల్ సర్వెంట్స్ సస్పెండ్ అవుతారని, ఈ విష‌యం మీద ఏపీ ప్ర‌భుత్వానికి ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్ ఛాలెంజ్ చేశారు. సునీల్ కుమార్ చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్‌లా డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ (white passport) ఉప‌యోగించి, ప్రజల పైసలతో విదేశాల‌కు వెళ్ల‌లేదు క‌దా.. అని ప్ర‌శ్నించారు. 30 ఏళ్ల సర్వీస్‌లో ఆ అవకాశాన్ని సునీల్ కుమార్‌కు ఎన్నడూ ఇవ్వలేదన్నారు.

దావోస్‌కు వెళ్లి తండ్రీకొడుకులు (చంద్ర‌బాబు, లోకేశ్‌) ప్రజల సొమ్ముతో ఎంచక్కా తిరిగి రావచ్చు. మీరు ఇచ్చిన టూర్ షెడ్యూల్ ప్రకారమే తిరిగిండ్రా చంద్ర‌బాబు గారూ అని ప్ర‌శ్నించారు. ఏ మాత్రం నిజాయితీ ఉన్నా చంద్ర‌బాబు ఇంతవరకు తిరిగిన విదేశాల టూర్ షెడ్యూల్స్ ను బయటపెట్టాల‌ని, ఎన్ని ఉల్లంఘనలు చేశారో ప్రజలకు తెలుస్తుందని డిమాండ్ చేశారు.

అయినా సునీల్ కుమార్ సొంత ఖర్చుతో విదేశాలకు వెళ్లొస్తే చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి క‌లిగిన నొప్పి ఏంట‌ని ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్ ప్ర‌శ్నించారు. ఎస్సీ, ఎస్టీలు విమానాలు ఎక్కొద్దా? వాళ్ల పిల్లలను విదేశాల్లో చదివించొద్దా? వాళ్లను చూడడానికి తండ్రులు విదేశాలకు వెళ్లొద్దా? ఇవన్నీ చంద్ర‌బాబు లాంటి ఆధిపత్య వర్గాల వారే చెయ్యాల్నా? అని ప్ర‌శ్నించారు. ఎస్సీలపై మీరు చేసిన వ్యాఖ్యలను నిజం చేయాలనుకుంటున్నారా? (ఉండి ఉండి ఎస్సీల ఇంట్లో పుట్టాలని ఎవరనుకుంటారు అన్నారు గుర్తుందా?) అని నిల‌దీశారు.

ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వంగల‌పూడి అనిత హోం మంత్రిగా ఉండి కూడా ఆ వర్గాలకు చెందిన ఆఫీసర్ల మీద ఎడాపెడా దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నార‌ని ప్ర‌శ్నించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు? ఏమ‌య్యార‌ని ప్ర‌శ్నించారు. ఈ విషయంలో ఎస్సీ ఎస్టీల ఓట్లను దండుకొని వాళ్ల ప్రయోజనాలను తుంగలో తొక్కిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను సస్పెండ్ చేయాలి, పీవీ సునీల్ కుమార్ ను కాదు అని ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment