సీజ్ ది షిప్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన ఈ ఆదేశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాకినాడ పోర్టులోకి అడుగుపెట్టి బియ్యం తరలిస్తున్న షిప్ సీజ్ చేయాలని స్పష్టంగా ప్రకటించిన పవన్ కామెంట్స్ పెద్ద వివాదానికి దారి తీశాయి. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం అనుబంధ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్సీఈఎల్) ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. షిప్ నిలిపివేత దేశ అంతర్జాతీయ ఒప్పందాలకు ప్రతికూలమని పేర్కొంటూ పవన్ కల్యాణ్ చీవాట్లు పెట్టినంత పనిచేసింది.
పవన్ ఆదేశాలు.. ఏం జరిగింది?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల తన పార్టీకి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి కాకినాడ పోర్టులోకి వెళ్లి రవాణా చేస్తున్న బియ్యాన్ని పరిశీలించారు. ఎవరినీ సంప్రదించకుండా, అధికారుల సలహాలు తీసుకోకుండా “సీజ్ ది షిప్” అనేశారు. బియ్యం ఎగుమతులపై అక్కడున్న ఎమ్మెల్యే, అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది రాజకీయ దుమారానికి కారణమైంది.
కేంద్రం లేఖ..
ఈ వ్యవహారంపై నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్సీఈఎల్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కాకినాడ కలెక్టర్‌కు లేఖ పంపించింది. ఆఫ్రికా దేశాలతో భారత్ చేసిన జీటు జీ ఒప్పందం ప్రకారం, నూక బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. బియ్యం నిలిపివేతతో అంతర్జాతీయ ఒప్పందానికి తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ఆకలి నివారణ కోసం నూక బియ్యం సరఫరా జీటుజీ ఒప్పందంలో భాగమని గుర్తు చేసింది. ఎన్సీఈఎల్ సీఈఓ అనుపమ్ కౌశిక్ ఈ లేఖలో కేంద్రం తరఫున తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాలను వివరించారు.
భారత్-ఆఫ్రికా సంబంధాలకు ముప్పు
ఆఫ్రికా దేశాలకు నూక బియ్యం సరఫరా భారత్-ఆఫ్రికా జీటు జీ ఒప్పందం కింద కీలకమైన అంశం. కాకినాడ పోర్టు నుంచి రవాణా జరుగుతున్న బియ్యం పైన తనిఖీల పేరుతో ఆటంకాలు సరికాదని కేంద్రం స్పష్టం చేసింది. ఫోర్టిఫైడ్ రైస్ అనుమానంతో ఎగుమతులను నిలిపివేయడం, అంతర్జాతీయ ఒప్పందాలకు ప్రతికూలమని హెచ్చరించింది.
పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రభావం
పవన్ కల్యాణ్ చేసిన “సీజ్ ది షిప్” వ్యాఖ్యల తర్వాత కేంద్ర ప్రభుత్వ స్పందించిన తీరు రాష్ట్ర రాజకీయాల్లో మరో చర్చకు దారితీశాయి. పవన్ కల్యాణ్ ఏ అవగాహన లేకుండా సీజ్ ది షిప్ అని ప్రకటించడం, ఆ నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకిస్తూ హెచ్చరికలు పంపించడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. బియ్యం ఎగుమతుల అంశంతో రాష్ట్రం, కేంద్రం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని పలువురు అనుకుంటున్నారు.