బీహార్ ‘జంగిల్‌రాజ్‌’ను మించిన ఏపీ ‘రెడ్‌బుక్ పాలన’!

బీహార్ 'జంగిల్‌రాజ్‌'ను మించిన ఏపీ ‘రెడ్‌బుక్ పాలన’

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 1990లలో బీహార్‌లో పేరుగాంచిన ‘జంగిల్ రాజ్’ పాలనను కూడా మించి, ఏపీలో ఇప్పుడు ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ అమలవుతోందన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్‌బుక్ ఆధారంగా పాలన సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్ పలు సందర్భాల్లో ‘రెడ్‌బుక్‌లోని పేజీలు తెరుస్తాం’ అంటూ వ్యాఖ్యలు చేయడం, ఆ తరువాత ప్రతిపక్ష నేతలపై చర్యలు, కేసులు, అరెస్టులు చోటుచేసుకోవడం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. ప్రభుత్వ పెద్దలను విమర్శించిన వైసీపీ నేతలపై భౌతిక దాడులు, వారి ఇళ్లపై దాడులు చేసి నిప్పు పెట్టే ఘటనలు పెరుగుతున్నాయి.

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై శ‌నివారం ఉదయం నుంచే దాడికి యత్నాలు జరిగాయి. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో అంబటిపై దాడి చేయడమే కాకుండా, ఆయన నివాసంపై దాడి చేసి నిప్పు పెట్టిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అదే తరహాలో, మరుసటి రోజే మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై వందల సంఖ్యలో టీడీపీ శ్రేణులు దాడి చేసి, నివాసానికి నిప్పు పెట్టిన ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.

ఈ వరుస ఘటనలతో 1990ల బీహార్ జంగిల్ రాజ్‌ను మించిన పరిస్థితులు ప్రస్తుతం ఏపీలో నెలకొన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలపై దాడులు పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా, పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే మంత్రి నారా లోకేశ్ ‘రెడ్‌బుక్ ప్రకారం శిక్షలు తప్పవు’ అంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో, పలువురు మాజీ మంత్రుల ఇళ్లపై, ఆస్తులపై దాడులు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. పలువురు మాజీ మంత్రులు అరెస్టై జైలుపాలయ్యారని, వందలాది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిన ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కోడి కోశారనే కారణంతో కేసులు పెట్టడం, పుట్టినరోజు వేడుకలు జరిపినందుకు కార్యకర్తలపై చర్యలు తీసుకోవడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

తాజా పరిణామాలు చూస్తుంటే, రాష్ట్రంలో ఎవరు ఏమి మాట్లాడినా ఇళ్లపై దాడులు జరుగుతాయా? అనే భయం ప్రజల్లో నెలకొంటోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ముందుముందు ఎవరి మీద దాడి జరుగుతుందో, ఎవరి ఇంటికి నిప్పు పెడతారో తెలియని అనిశ్చితి వాతావరణం కొనసాగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పటి బీహార్ జంగిల్ రాజ్ కంటే కూడా ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోంది. ‘జంగిల్ రాజ్‌ను మించిన రెడ్‌బుక్ పాలన’ ఏపీలో కొనసాగుతోందన్న చర్చ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment