ప్రస్తుతం యువతకు ఆరాధ్య తారగా మారిన రష్మిక మందన్నా (Rashmika Mandanna), కన్నడ (Kannada)లోని మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు జాతీయ స్థాయిలో క్రష్ హీరోయిన్ (Crush Heroine)గా వెలుగొందుతున్నారు. కన్నడ సినీ పరిశ్రమలో తన ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ, ఆమెకు అగ్రతార హోదాను తెచ్చిపెట్టింది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమనే అని చెప్పడంలో సందేహం లేదు. ‘ఛలో’ (‘Chalo’) చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రష్మిక, ఇటీవల విడుదలైన ‘కుబేర’ (‘Kubera’) వరకు అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా రాణిస్తున్నారు. అదేవిధంగా తమిళంలో ‘సుల్తాన్’, ‘వారిసు’ వంటి చిత్రాలతో మెరిశారు. బాలీవుడ్‌లో ‘గుడ్‌బై’తో అరంగేట్రం చేసిన రష్మికకు ఆ చిత్రం యావరేజ్ అనిపించినా, ఆ తర్వాత నటించిన ‘యానిమల్’ చిత్రం మాత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. రణ్‌బీర్ కపూర్‌కు జోడీగా రష్మిక నటించిన ‘యానిమల్’ 2023 డిసెంబర్‌లో విడుదలై, విమర్శలు, ప్రశంసలు రెండూ అందుకుంది.
‘యానిమల్’పై రష్మిక స్పందన
‘యానిమల్’ చిత్రం ముఖ్యంగా హీరో రణ్‌బీర్ కపూర్ పాత్రపై తీవ్ర విమర్శలను ఎదుర్కొంది, ఆయన ఎక్కువగా సిగరెట్లు తాగే సన్నివేశాలపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, సినిమా మాత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఈ విషయంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందించిన రష్మిక మందన్నా, తాను ఆ చిత్రాన్ని ఒక సినిమాగానే చూశానని పేర్కొన్నారు. చిత్రంలో హీరో సిగరెట్ తాగితే అది ఇతరులను సిగరెట్లు తాగేలా ప్రేరేపిస్తుందని కొందరు అంటున్నారని, అయితే సమాజంలో ప్రజలు సిగరెట్లు తాగడం అనేది సర్వసాధారణం అని ఆమె అభిప్రాయపడ్డారు.
‘సినిమా వదిలేస్తా కానీ ఆ పని చేయను’
అయితే, తాను మాత్రం సినిమాల్లో కూడా సిగరెట్లు (Cigarettes) తాగే విధంగా నటించబోనని రష్మిక స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి పాత్రలు వస్తే.. సినిమానే వదిలేస్తానని ఆమె తేల్చి చెప్పారు. చిత్రాన్ని ఒక చిత్రంగానే చూడాలని, ఎవరినీ సినిమా చూడమని బలవంతం చేయడం లేదని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఒక్కో చెడ్డ అలవాటు ఉంటుందని, దానిని ‘యానిమల్’ చిత్రంలో దర్శకుడు చూపించారు అంతే అని రష్మిక మందన్నా వివరించారు. కాగా, చిత్రం విడుదలై ఏడాదిన్నర పైగా అయినప్పటికీ ‘యానిమల్’ చిత్రంపై విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి.