ఏపీ (Andhra Pradesh)లో కొత్త జిల్లాల ఏర్పాటు (New District Formation)పై కూటమి ప్రభుత్వం (Coalition Government) తీసుకున్న నిర్ణయం రాయచోటి ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister N. Chandrababu Naidu) ఇచ్చిన హామీ కూడా నెరవేరకపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాను (Annamayya District) మూడు ముక్కలు చేసి, రాయచోటి జిల్లా కేంద్ర హోదాను తొలగించి మదనపల్లిలో కలపడం తీవ్ర వివాదానికి దారితీసింది.
ఈ నిర్ణయాన్ని జిల్లా వాసులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాయచోటి అభివృద్ధికి ఇది తీవ్ర నష్టం చేస్తుందని, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు జేఏసీ సమావేశం నిర్వహించనుండగా, భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చ జరగనుంది. రేపటి నుంచి పెద్దఎత్తున ఆందోళనలకు దిగే యోచనలో జేఏసీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ(YSRCP) చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి (Rampasad Reddy),గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించింది. “మాట మీద నిలబడే వాడివైతే వెంటనే రాజీనామా (Resignation) చేయ్!” అంటూ వైసీపీ అధికారికంగా సవాల్ విసిరింది.
గతంలో “నా కారణంగా అన్నమయ్య జిల్లా పోతుందంటే రాజీనామా చేస్తా” అంటూ బీరాలు పలికిన రాంప్రసాద్‌రెడ్డి, ఇప్పుడు జిల్లా కేంద్రం చేజారినప్పటికీ క్యాబినెట్‌లో వ్యతిరేకించలేదని వైసీపీతో పాటు రాయచోటి ప్రజల అభిప్రాయం. అందుకే నిరసనలకు దిగారు. “ఇప్పుడు కన్నీరు కారిస్తే ఉపయోగం ఏంటి? జిల్లా పోయింది… రాయచోటి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాజీనామా ఎప్పుడు?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రాంప్రసాద్‌రెడ్డి రాజీనామా చేసి పోరాటానికి దిగితే తనను గెలిపించిన రాయచోటి ప్రజల దృష్టిలో హీరో అవుతారని, లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదనేది అన్నమయ్య జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో కూడా మంత్రి రాంప్రసాద్‌రెడ్డిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో “రాయచోటి (Rayachoti) జిల్లా కేంద్రం పోతే మీసం తీసేసి, రాజీనామా చేస్తా” అంటూ చేసిన సవాలు ఇప్పుడు ఆయన్ను ఇరకాటంలో పడేసిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. “ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే సీమ బిడ్డగా పేరు నిలుపుకుంటారా? లేక ఇదంతా తూచ్.. రాజకీయాల్లో ఒక భాగం అంటూ చేతులు దులుపుకుంటారా?” అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం కేవలం పరిపాలనా నిర్ణయంగా కాకుండా, ఇప్పుడు రాయచోటి కేంద్రంగా రాజకీయ భవిష్యత్‌ను ప్రభావితం చేసే అంశంగా మారింది. రాబోయే రోజుల్లో జేఏసీ ఆందోళనలు, ప్రతిపక్ష దాడులు ఈ అంశాన్ని మరింత వేడెక్కించనున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.








