తెలంగాణ (Telangana) సీఎం (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం మానేసి, ప్రభుత్వం ఏమి సాధించిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. “ఓడ దాటే వరకు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న (Mallanna)” అన్నట్లు సీఎం వైఖరి మారిందంటూ ఎద్దేవా చేశారు.
“రేవంత్ తన భాష మార్చుకోవాలి”
మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ –
“రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలి. ప్రతిపక్షాలపై దాడులకు కాకుండా, ప్రభుత్వ పనితీరు గురించి ప్రజలకు చెప్పాలి. మూడున్నరేళ్లు ఆయన సీఎం కాగలరని, ఆ తర్వాత ఎవరు అవుతారో కాలమే నిర్ణయిస్తుంది. మేమంతా కలిసే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే, నాకు మంత్రి పదవి హైకమాండ్ హామీ ఇచ్చింది. ఆ విషయం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy)కి తెలియకపోవచ్చు,” అని వ్యాఖ్యానించారు.
“రేవంత్ వ్యవహారం ఓడ మల్లన్నలా మారింది”
సోషల్ మీడియా విషయంలో రేవంత్ రెడ్డి మాటలు ఇప్పుడిప్పుడే తేలిపోతున్నాయని విమర్శించారు.
“ఓడ దాటే వరకు ఓడ మల్లన్న, దాటి తర్వాత బోడ మల్లన్న అన్నట్లు సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారు. నాకు పదవి కావాలంటే అప్పుడే కేసీఆర్(KCR) ఇచ్చేవారు. బీఆర్ఎస్(BRS) ఇప్పుడు అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్‌లో ఉంది,” అని వ్యాఖ్యానించారు.
“కేసీఆర్ అసెంబ్లీకి రాలేదంటే…”
కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, అలా అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఉండే హక్కు లేదని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
“కేసీఆర్ ముందుగా తన ప్రతిపక్ష హోదా నుండి తప్పుకోవాలి. రేవంత్ రెడ్డి కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కాలేశ్వరం అవినీతి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు?” అని ప్రశ్నించారు.
తాజాగా సోషల్ మీడియా జర్నలిస్టులపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ ఇప్పటికే ట్విట్టర్ వేదికగా స్పందించగా, ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని లేవదీశారు. మొత్తం మీద మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి – సీఎం రేవంత్‌ను టార్గెట్ చేస్తూ విమర్శల మోత మోగించారు.