తెలంగాణలోని మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ అరెస్ట్ కావడం, ఆ వెంటనే ఆయనకు స్టేషన్ బెయిల్ లభించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) వేదికగా సంధించిన ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
రాజ్ దీప్ సర్దేశాయి వేసిన ప్రశ్నలివే..
డ్రగ్స్ కేసులో ఒక ప్రజాప్రతినిధికి ఇంత వేగంగా ఉపశమనం లభించడంపై రాజ్ దీప్ విస్మయం వ్యక్తం చేశారు. ఆయన తన పోస్ట్‌లో ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించారు. “నిన్ననే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి, ఇవాళ నేరుగా పార్లమెంట్ సమావేశాలకు ఎలా హాజరయ్యారు? ఇది వ్యవస్థలో ఉన్న లొసుగులకు నిదర్శనం కాదా?” అని ప్రశ్నించారు.
సామాన్యుడికి ఇది సాధ్యమేనా?
డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కేవలం ఒక్క రోజులోనే బెయిల్ ఎలా దొరుకుతుందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే కేసులో ఒక సామాన్యుడు ఉంటే పరిస్థితి ఇలాగే ఉండేదా? అని నిలదీశారు. “డ్రగ్స్‌ను ఉక్కుపాదంతో అణచివేస్తామని ప్రగల్భాలు పలికే నాయకుల మాటలు ఏమయ్యాయి? తమ సొంత పార్టీ నేతలు దొరికినప్పుడు ఈ చట్టాలు ఎందుకు చుట్టాలుగా మారుతున్నాయి?” అంటూ విమర్శించారు.
వెల్లువెత్తుతున్న విమర్శలు
రాజ్ దీప్ సర్దేశాయి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఒకవైపు డ్రగ్స్ రహిత రాష్ట్రం అని చెబుతూ, మరోవైపు డ్రగ్స్ తీసుకున్న ఎంపీని పార్లమెంట్‌కు పంపడం ఏ రకమైన రాజకీయం?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యి, ఎంపీని వివరణ కోరినప్పటికీ.. బెయిల్ వ్యవహారం మాత్రం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.









