ఐపీఎల్ టైటిల్‌పై ఆర్సీబీ కెప్టెన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌

ఐపీఎల్ టైటిల్‌పై ఆర్సీబీ కెప్టెన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పురుషుల జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ (Rajat Patidar) ఐపీఎల్ టైటిల్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. 18 సంవత్సరాలుగా ఐపీఎల్ టైటిల్ (IPL Title) గెలవలేదన్న విమర్శలకు సమాధానమిచ్చారు. “ఆర్సీబీకి ట్రోఫీ లేదని ఇక ఎవరూ అనలేరు. ఇప్ప‌టికే మా మహిళల జట్టు ట్రోఫీ ( Women’s Team Trophy) గెలిచింది” అని స్పష్టం చేశారు. ఆర్సీబీ మహిళల జట్టు 2024లో డబ్ల్యూపీఎల్ టైటిల్ (WPL Title) సాధించిన విజయం మాకు స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు.

స్మృతి మందాన (Smriti Mandhana) నాయకత్వంలో ఆర్సీబీ మహిళల జట్టు 2024లో డబ్ల్యూపీఎల్ ట్రోఫీ గెలిచింది, ఇది ఫ్రాంచైజీకి తొలి టైటిల్. రజత్ మాట్లాడుతూ “మహిళల జట్టు విజయం మాకు గర్వకారణం. ఆర్సీబీకి ట్రోఫీ లేదని చెప్పడం సరికాదు” అని అన్నారు. ఈ స్ఫూర్తితో పురుషుల జట్టు ఐపీఎల్ 2025 (IPL 2025)లో టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుందని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా రజత్ తన జ‌ట్టుపై ఉన్న అభిమానాన్ని పంచుకున్నారు. “విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ లాంటి ఆటగాళ్లను చూసేందుకే ఐపీఎల్ చూడటం మొదలుపెట్టాను. వారిని చూస్తూ ఆర్సీబీ తరఫున ఆడాలనే కల ఉండేది” అని చెప్పారు. ర‌జ‌త్ త‌న కలను నెరవేర్చుకొని, ప్ర‌స్తుతం కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్నారు.

ఆర్సీబీ పురుషుల జట్టు 2008 నుంచి ఐపీఎల్‌ ఆడుతున్నప్పటికీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా టైటిల్ గెలవలేదు. 2016లో ఫైనల్‌కు చేరినా ఓటమి చవిచూసింది. ఈసారి ఎలాగైనా క‌ప్పు కొట్టాల‌నే ఉత్సాహంతో జ‌ట్టు ఉన్న‌ప్ప‌టికీ.. భార‌త్‌-పాక్ యుద్ధం ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు తాత్కాలిక అంత‌రాయం క‌లిగించింది. మ‌ళ్లీ ఈనెల 17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కానుండ‌గా, మునుప‌టి ఫామ్‌ను ఆర్సీబీ కంటిన్యూ చేస్తుందా అనేది ప్ర‌శ్నార్థకంగా మారింది. ఈసారి ఎలాగైనా ఆర్సీబీ క‌ప్పుకొడుతుంద‌ని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment