7 నెలల్లో 25 మందితో పెళ్లి.. ‘లూటీ బ్రైడ్‌’ అరెస్ట్‌

7 నెలల్లో 25 మందితో పెళ్లి.. 'లూటీ బ్రైడ్‌' అరెస్ట్‌

కేవలం ఏడు నెలల వ్యవధిలో 25 మంది పురుషులను పెళ్లి చేసుకొని వారి కుటుంబాల‌ను నిలువు దోపిడీ చేసిందో యువ‌తి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజస్థాన్‌కు చెందిన 23 ఏళ్ల యువతి అనురాధ పాస్వాన్ సులువుగా డ‌బ్బు సంపాదించాల‌నుంది. ఇందుకు తాను పెళ్లి అనే ఎమోష‌న‌ల్ బాండ్‌ను ఎంచుకుంది. ఈ మోసపూరిత వివాహాల ద్వారా నగదు, బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగిలించి పరారవుతున్న యువ‌తిని ఎట్ట‌కేల‌కు మాధోపూర్ పోలీసులు భోపాల్‌లో అరెస్టు చేశారు.

మోసం ఎలా జరిగింది?
అనురాధ పాస్వాన్ తనను తాను ఒంటరి, పేద మహిళగా పరిచయం చేసుకుంటూ పెళ్లికి సిద్ధంగా ఉన్న పురుషులను నమ్మించేది. పెళ్లి తర్వాత అత్తారింట్లో అమాయకురాలిగా నటిస్తూ కొద్ది రోజులు గడిపేది. ఆ తర్వాత, కుటుంబ సభ్యులకు మత్తు మందు కలిపిన ఆహారం పెట్టి, వారు స్పృహతప్పిన సమయంలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను దొంగిలించి పరారయ్యేది. ఈ విధంగా ఆమె దాదాపు 25 మంది వ్యక్తులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

లూటీ బ్రైడ్ నేర చ‌రిత్ర‌..
అనురాధ వెనుక ఒక ముఠా ఉంద‌ని, మ్యారేజీ బ్యూరో ఏజెంట్లగా ముఠా పనిచేసేదని పోలీసులు గుర్తించారు. అమాయ‌క వరుడి కుటుంబాలకు అనురాధ చిత్రాలను పంపి, 2 నుండి 5 లక్షల రూపాయల వరకు ఈ ముఠా డిమాండ్ చేసేది. ఆ త‌రువాత వారం రోజుల్లో పెళ్లి చేసి పంపిస్తారు. అనంత‌రం అత్తారింట్లో అనురాధ స్కెచ్ మొద‌ల‌వుతుంది. అమాయ‌కురాలిలా న‌టించి ఆహారంలో మ‌త్తుమందు క‌లిపి ఇంట్లో దొరికిన న‌గ‌లు, న‌గ‌దు దండుకొని ఉడాయిస్తుంది. ఇలా లూటీ బ్రైడ్ వ‌ల‌లో చిక్కి మోస‌పోయిన వ‌రుడు విష్ణు శర్మ అనే వ్యక్తి సవాయి మాధోపూర్‌లో మే 3న ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. విష్ణు శర్మ రూ. 2 లక్షలు చెల్లించి అనురాధను పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆమె మే 2న రూ. 1.25 లక్షల విలువైన ఆభరణాలు, రూ. 30,000 నగదు, రూ. 30,000 విలువైన మొబైల్‌తో పరారైంది.

అనురాధ అరెస్టు ఎలా అంటే?
సవాయి మాధోపూర్ పోలీసులు అనురాధను పట్టుకునేందుకు ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఒక కానిస్టేబుల్‌ను వరుడిగా మార్చి, ఆమె ఏజెంట్‌తో సంప్రదింపులు జరిపారు. ఏజెంట్ అనురాధ ఫోటోలను పంపినప్పుడు, పోలీసులు వెంటనే ఆమెను భోపాల్‌లో గుర్తించి అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో ఆమెతో పాటు ముఠాలోని ఇతర సభ్యులు రోష్ని, రఘుబీర్, గోలు, మజ్‌బూట్ సింగ్ యాదవ్, ఆర్జన్‌లను కూడా పోలీసులు గుర్తించారు. వీరంతా భోపాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు.

అనురాధ నేపథ్యం
అనురాధ పాస్వాన్ ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో ఒక ఆసుపత్రిలో పనిచేసేది. ఆమె గతంలో ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది, కానీ గృహ హింస కారణంగా అతని నుండి విడిపోయింది. ఆ తర్వాత భోపాల్‌కు వచ్చి, అక్కడ వివాహ మోసాల ముఠాతో చేరింది. ఈ ముఠా ఆమెను ఉపయోగించుకుని అనేక మందిని మోసం చేసింది. ఆమె చివరిగా భోపాల్‌లో గబ్బర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని, అతని నుండి రూ. 2 లక్షలు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment