పార్లమెంట్ ఆవరణలో గురువారం పెద్ద తోపులాట జరిగింది. కేంద్రమంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు నిరసన తెలపగా, బీజేపీ ఈ నిరసనలకు ప్రతిఘటిస్తూ అబద్ధాల ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ వివాదం మరింత ఊపందుకొని రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీని తోసేయడంతో ఈ సంఘటనలో పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
రాహుల్‌పై బీజేపీ ఎంపీ ఆరోపణలు..
పార్లమెంట్ గేటు వద్ద జరిగిన గొడవలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. రాహుల్ గాంధీ తనను గట్టిగా తోసేయడంతో తలకు గాయమైనట్లు బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి పేర్కొన్నారు. కానీ, రాహుల్ గాంధీ మాత్రం తమపై బీజేపీ ఎంపీల బృందమే దాడి చేస్తుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు. గాయపడిన బీజేపీ ఎంపీ సారంగిని ఆస్పత్రికి తరలించారు.
రాహుల్ గాంధీ స్పందన
ఈ విషయంపై రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ “బీజేపీ ఎంపీల బృందం నా మీద దాడి చేసింది. వారు నన్ను బెదిరించారు. ఈ సంఘటన సందర్భంగా మల్లికార్జున ఖర్గేను కూడా బెదరించారు” అని వివరించారు.