లోక్‌సభలో చైనాతో సరిహద్దు వివాదంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. బీజేపీ సభ్యులు నినాదాలతో ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, రాహుల్ తన వాదనను కొనసాగించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే రాసిన పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశాన్ని, సాయుధ బలగాలను రాహుల్ పదేపదే అవమానిస్తున్నారని బీజేపీ సభ్యులు మండిపడ్డారు. స్పీకర్ కూడా రాహుల్ తీరును తప్పుపట్టుతూ సభ నియమాలను ఉల్లంఘిస్తున్నారని వ్యాఖ్యానించారు.
లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ డోక్లాం అంశాన్ని ప్రస్తావించడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆయన మాట్లాడటం ప్రారంభించగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లేచి నిలబడి అభ్యంతరం తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఈ అంశం లేదని, అందువల్ల దీనిపై చర్చకు అవకాశం లేదని వారు స్పష్టం చేశారు. డోక్లాం, చైనా అంశాలపై రాహుల్ వ్యాఖ్యలను రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు.
మాజీ ఆర్మీ చీఫ్ నరవణే చైనా, డోక్లాం అంశాలపై రాసిన పుస్తకాన్ని రాహుల్ ప్రస్తావించాలనుకున్నప్పటికీ, ఆ పుస్తకం ఇప్పటివరకు ప్రచురించలేదని కేంద్ర మంత్రులు తెలిపారు. ప్రచురించని పుస్తకాన్ని పార్లమెంటులో ఉదహరించడం సరికాదని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేస్తూ రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆ పుస్తకం ప్రచురించిందా లేదా అనే విషయాన్ని సభకు తెలియజేయాలని అమిత్ షా డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన రాజ్‌నాథ్ సింగ్, సభను తప్పుదారి పట్టించేలా అనవసర వ్యాఖ్యలు చేయొద్దని రాహుల్‌ను హెచ్చరించారు.
ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ రాహుల్‌కు మద్దతుగా నిలబడి, ఆయనకు ఆ పుస్తకం గురించి మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. చైనా అంశం సున్నితమైనదైనా, చర్చను అడ్డుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే స్పీకర్ రాహుల్ సభ మర్యాదను పాటించడం లేదని మరోసారి హెచ్చరించారు. అధికార పక్షాన్ని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ, వారు పుస్తకానికి భయపడుతున్నారని, భయం లేకపోతే చదవనివ్వాలని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, సభ నిబంధనల ప్రకారమే నడుస్తుందని స్పష్టం చేశారు. నరవణే పుస్తకంలో తప్పుడు అంశాలు ఉన్నందున దాన్ని ప్రచురించేందుకు అనుమతి ఇవ్వలేదని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అలాంటి పుస్తకాన్ని సభలో ప్రస్తావించడం తప్పేనని ఆయన తేల్చి చెప్పారు.







