ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు (Raghurama Krishna Raju)పై సీబీఐ (CBI) దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ పరిణామాల నడుమ ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) చేస్తున్న వరుస పోస్టులు సంచలనం సృష్టిస్తున్నాయి. దర్యాప్తు సక్రమంగా జరగాలనే నన్ను సస్పెండ్ చేశారు. మంచిదే. అదే విధంగా సమ న్యాయం కోసం రఘురామకృష్ణ రాజును కూడా అన్ని పదవుల నుంచి తప్పించాలి. చట్టం అందరికీ సమానం అనే సందేశం వెళ్లాలి” అంటూ వ్యాఖ్యానించడంతో పాటు ట్విట్టర్ పోల్‌ను కూడా ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పోస్ట్ చేశారు.
సునీల్ కుమార్ మరో పోస్ట్
రఘురామ కృష్ణరాజు గారూ.. అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ మరో పోస్ట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ”మా నాన్న పేరు గంగ రాజు. ఇది హిందూ పేరు. మీకు తెలియక పోవచ్చు. మా తాత గారి పేరు పాతాళ పెంటయ్య. ఆయన కొవ్వూరు లో పెద్ద మాల. ఇది కూడా తెలియక పోవచ్చు మీకు. తండ్రి కులం వస్తుంది పిల్లలకు. మా తల్లి పేరు ఎత్తే అర్హత మీకు లేదు” అంటూ పీవీ సునీల్ కుమార్ రఘురామకృష్ణరాజుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
”మీ కుటుంబంలో మీరు 420, మీ కొడుకు భరత్ 420, మీ కూతురు ఇందిర ఒక 420 . మొత్తంగా మీరంతా కేసుల్లో ఉన్న ఒక నేర కుటుంబం. మోసం చేస్తేగాని పూట గడవని మీ కుటుంబానికి అందరూ మోసగాళ్లుగా కనిపించడంలో వింత ఏముంది..? ఈ కనుమూరి రమాదేవి ఎవరో నాతెలీదు.. మీకు ఏమైనా తెలుసా RRR? బ్యాంకుల్ని మోసం చేయడం మీ కుటుంబ జీవన ఆధారం. మీ బతుకు మీకు గుర్తు చేయాలా? ఇంకా చాలా మాట్లాడగలను.. ఇక్కడ మీ సన్నాసి పోస్ట్ లకు బెదిరే వాళ్ళు ఎవరు లేరు” అంటూ ఘాటుగా స్పందిస్తూ ఫేస్‌బుక్‌లో పీవీ సునీల్ కుమార్ పోస్ట్ చేశారు.
రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులో పీవీ సునీల్ కుమార్‌ను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ వస్తోంది. ఇటీవల సునీల్ కుమార్ విచారణకు కూడా హాజరైన విషయం తెలిసిందే.









