అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాపై తెలంగాణ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. స్మగ్లర్‌ను హీరోగా చూపించి, పోలీసుల దుస్తులు విప్పించి నిలబెట్టి, పోలీస్ స్టేషన్‌ను కొన్న సినిమాలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు గానూ జాతీయ అవార్డు వరించింది. 2023 అక్టోబర్ 17న అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. బన్నీ ఈ అవార్డు అందుకున్న సంవత్సరం దాటిన తరువాత మంత్రి సీతక్క ఈ అంశంపై స్పందించారు. మంత్రి కామెంట్స్‌పై బన్నీ ఫ్యాన్స్ గరం అవుతున్నారు. అవార్డు అందుకొని ఏడాది దాటిందని, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.
మంత్రి సీతక్క ఏమన్నారంటే..
జై భీమ్ వంటి సందేశాత్మక సినిమాలకు ప్రోత్సాహకం, అవార్డులు ఎందుకు లేవు? అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పుష్ప సినిమా ఇలాంటి కథలు నేరాలను ప్రోత్సహించవచ్చని, మానవతా విలువలపై దృష్టి పెట్టే సినిమాలు రావాలని ఆమె అభిప్రాయపడ్డారు. స్మగ్లర్లను హీరో, స్మగ్లింగ్‌ను అడ్డుకునే పోలీస్ విలన్ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఇది సమాజంపై దుష్ప్రభావం చూపుతుందని మంత్రి అభిప్రాయపడుతున్నారు. మంత్రి సీతక్క ప్రకటనపై సినీ ప్రపంచం ఎలా స్పందిస్తుందో చూడాలి.