“పత్తి వ్యాపారం చేస్తే రక్షణ కల్పించలేం”: డీఐజీ వెటకారం

"పత్తి వ్యాపారం చేస్తే రక్షణ కల్పించలేం": డీఐజీ వెటకారం

పులివెందులలో జరగబోయే జెడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని, అయితే పోలీసులు దాడికి గురైన వారినే టార్గెట్ చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

బుధవారం, వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముపై దాడి జరిగింది. అయితే, ఈ ఘటనలో బాధితులు అయిన వేల్పుల రాము, హేమాద్రిలతో సహా 52 మందిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయటం గమనార్హం.

మంగళవారం బీటెక్ రవి అనుచరులు, బుధవారం నల్లగొండువారిపల్లెలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై దాడులు జరిగినప్పటికీ, ఇప్పటివరకు ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. గాయపడిన వారికి న్యాయం చేయాల్సింది పోయి, డీఐజీ కోయ ప్రవీణ్, “ఒంటిపై గాయాలు కనపడకపోతే ఎలా అరెస్ట్ చేస్తాం?” అని వెటకారంగా మాట్లాడారని వారు ఆరోపిస్తున్నారు.

ఈ పరిణామాలపై డీఐజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. “ప్రచారం చేయాల్సిన పల్లెల్లో కాకుండా వేరే చోటికి వెళ్లి పత్తి వ్యాపారం చేస్తే రక్షణ కల్పించలేం” అని, “తాము లేకపోతే తలకాయలే ఎగిరి పోయేవి” అని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిపై కూడా బైండోవర్ కేసులు పెడుతున్నారని వారు పేర్కొన్నారు.

ఈ ఘటనల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పులివెందులలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ నేతలను అవమానించే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని, దాడి చేసిన వారిని వదిలిపెట్టి, బాధితులపైనే కేసులు పెడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment