కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ మరియు దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రముఖ పౌర హక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు అగ్రనేతల ఉనికిని గుర్తించడంలో కేంద్రం సాంకేతికతను సమర్థవంతంగా వాడుకుందని ఆయన విశ్లేషించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
టెక్నాలజీతో దెబ్బకొట్టిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో ప్రభుత్వం విజయం సాధించిందని హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మావోయిస్టు అగ్రనేతల మూలాలను ప్రభుత్వం గుర్తించగలిగిందని, అదే సమయంలో ఉద్యమాల్లో ఉన్న కొన్ని బలహీనతలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మారాయని ఆయన పేర్కొన్నారు.
గణపతి బతికే ఉన్నారా?
మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి వ్యవహారం ఇప్పుడు ఒక మిస్టరీగా మారిందని హరగోపాల్ వ్యాఖ్యానించారు. “గణపతి గారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో, అసలు ఆయన బ్రతికి ఉన్నారో లేదో కూడా అనుమానంగా ఉంది. ఆయన దేశంలో ఉన్నారా లేదా అన్నది ఎవరికీ తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన స్వయంగా బయటకు వచ్చి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది” అని హరగోపాల్ అన్నారు.
ప్రశ్నిస్తే నేరమా?
ప్రభుత్వం తరచూ వాడుతున్న ‘అర్బన్ నక్సలిజం’ అనే పదంపై హరగోపాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు అర్బన్ నక్సలైట్ అనే పదానికి నిర్వచనం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చివరకు రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అంటున్నారని, కేంద్రాన్ని విభేదించే వారందరినీ ఈ ముద్ర వేసి వేధిస్తున్నారని ఆరోపించారు. దేశంలో మావోయిజమే లేనప్పుడు, ఇక ‘అర్బన్ నక్సలిజం’ ఎక్కడి నుంచి వస్తుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ నక్సలైట్లుగా చిత్రీకరించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని హెచ్చరించారు.
సంపద కోసం వేట.. తప్పని పోరాటం
మావోయిజం అంతమైనంత మాత్రాన ప్రజా పోరాటాలు ఆగవని ప్రొఫెసర్ స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అపారమైన సహజ సంపద ఉంది. దానిని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు, దోచుకోవాలని చూస్తే ఆదివాసీల నుంచి తిరుగుబాటు తప్పదు. సమస్యలు ఉన్నచోట పోరాటాలు సహజంగా పుట్టుకొస్తాయి. మావోయిజం కాకపోయినా, భవిష్యత్తులో ఆ పోరాటం ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కేవలం అణచివేతతో ఉద్యమాలను ఆపలేరని ఆయన కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు.








