నటి ప్రత్యూష మరణం: 24 ఏళ్ల మిస్టరీ.. అసలు ఏమైంది?

నటి ప్రత్యూష మరణం: 24 ఏళ్ల మిస్టరీ.. అసలు ఏమైంది?

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘రాయుడు’, ‘కలిసి నడుద్దాం’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన నటి ప్ర‌త్యూష‌ మరణం అప్పట్లో సంచలనంగా మారింది. 2002లో జరిగిన ఈ ఘటన దాదాపు రెండు దశాబ్దాల పాటు అనుమానాలు, ఆరోపణలు, రాజకీయ వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచింది. తాజాగా సుప్రీం కోర్టు తుది తీర్పుతో ఈ కేసుకు చట్టపరంగా ముగింపు లభించింది.

ఘటన ఎలా జరిగింది?
2002 ఫిబ్రవరి 23న ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండ‌గా, చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌త్యూష మ‌ర‌ణం సంభవించింది. ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్‌లో విషం సేవించిన స్థితిలో కేర్ ఆసుపత్రిలో చేరారు. అయితే వీరి ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి ప్రేమ వ్యవహారం, పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం కారణం అని అప్ప‌ట్లో భావించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్ప‌త్రిలో చేరిన న‌టి ప్ర‌త్యూష మ‌రుస‌టి రోజు ఫిబ్రవరి 24న చికిత్స పొందుతూ మరణించగా, సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదే కేసులో ఆయనపై “ఆత్మహత్య ప్రేరేపణ” ఆరోపణలు నమోదయ్యాయి.

తల్లి పోరాటం, రాజకీయ ఆరోపణలు
ప్రత్యూష తల్లి సరోజినీ దేవి మాత్రం ఇది ఆత్మహత్య కాదని, అత్యాచారం తర్వాత హత్య జరిగిందని ఆరోపిస్తూ సుదీర్ఘ న్యాయపోరాటం సాగించారు. అప్పట్లో కొందరు రాజకీయ నేతల కుమారుల ప్రమేయంపై కూడా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అప్పటి తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వంలో హోంమంత్రిగా ప‌నిచేసిన దేవేంద‌ర్ గౌడ్‌ కుమారుడిపై ఆరోపణలు వినిపించాయి. ప్ర‌త్యూష‌ను గ్యాంగ్ రేప్ చేసి, గొంతు నులిమి హ‌త్య చేశార‌ని అప్ప‌టి మునిస్వామి క‌మిటీ అనుమానించింది. అయితే ఈ కేసును విచారించిన సీబీఐ దర్యాప్తులో రాజకీయ నాయకుల ప్రమేయానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. సీబీఐ రిపోర్ట్‌పై కూడా ఆమె అభిమానులు, స‌న్నిహితులు ఆరోప‌ణ‌లు చేశారు. అధికారాన్ని ఉప‌యోగించుకొని కీల‌క నిందితుల పేర్లు తొల‌గించుకున్నార‌ని ఆరోప‌ణ‌లు వినిపించాయి.

ఫోరెన్సిక్ వివాదం
కేసులో ఫోరెన్సిక్ నివేదికలు కూడా చర్చకు దారితీశాయి. ప్ర‌త్యూష‌ గొంతు నులిమిన ఆనవాళ్లు ఉన్నాయని ఒక దశలో ప్రచారం జరిగింది. కానీ, అనంతర నివేదికల్లో అలాంటి నిర్ధారణలు వెలువడలేదు. దీంతో కేసు మరింత గందరగోళంగా మారింది.

2004లో నాంపల్లి కోర్టు సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం హైకోర్టు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గించింది. చివరగా, 2026 ఫిబ్రవరి 16న సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు వివ‌రాల ప్ర‌కారం.. ప్రత్యూష మరణం హత్య కాదు, ఆత్మహత్యే. అత్యాచారం లేదా హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. సిద్ధార్థ రెడ్డి అప్పీల్‌ను కొట్టివేస్తూ, కోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల్లో లొంగిపోవాలని సూచించింది.

చట్టపరంగా ఈ కేసులో సిద్ధార్థ రెడ్డి మాత్రమే దోషిగా తేలినా, ప్రత్యూష తల్లి సరోజినీ దేవి మాత్రం తన కుమార్తెకు పూర్తి న్యాయం జరగలేదని ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ చరిత్రలో ఈ కేసు ఒక వివాదాస్పద అధ్యాయంగా నిలిచిపోయింది. 24 ఏళ్ల తర్వాత చట్టపరంగా ముగిసినప్పటికీ, ప్రజల మదిలో ఇది ఇంకా ప్రశ్నలనే మిగిల్చుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment