సంపద సృష్టికి (Wealth Creation) పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) (PPP) విధానం అత్యంత ఉత్తమ మార్గమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్పష్టం చేశారు. అమరావతి (Amaravati)లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ (Atal Bihari Vajpayee) కాంస్య విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, పీపీపీ విధానంలోనే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని వాజ్‌పేయీ గట్టిగా నమ్మేవారని వ్యాఖ్యానించారు.
పీపీపీ విధానంపై కొందరు నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించిన చంద్రబాబు, వాజ్‌పేయీ కాలంలో తీసుకున్న సంస్కరణలే దేశాభివృద్ధికి పునాదిగా నిలిచాయని తెలిపారు. చరిత్రను తిరగరాసే నాయకత్వం వాజ్‌పేయీదని కొనియాడారు. తనకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చిన నేత ఎన్టీఆర్(NTR) అని, యాంటీ కాంగ్రెస్ సెంటిమెంట్‌కు బీజం వేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తుచేశారు.
ఆర్థిక సంస్కరణలను ప్రారంభించిన పీవీ నరసింహరావు (P.V. Narasimha Rao) మన తెలుగుబిడ్డ అని గుర్తు చేసిన చంద్రబాబు, ఎన్టీఆర్, వాజ్‌పేయీ ఇద్దరూ అత్యంత చనువుగా ఉండేవారని తెలిపారు. నేషనల్ ఫ్రంట్ ద్వారా యాంటీ కాంగ్రెస్ ఉద్యమానికి ఎన్టీఆర్ బీజం వేశారని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి వాజ్‌పేయీ కీలకంగా కృషి చేశారని అన్నారు.
ఒకప్పుడు తాను ఫోన్ గురించి మాట్లాడితే చాలా మంది ఎగతాళి చేశారని, కానీ నాలెడ్జ్ ఎకానమీకి టెలికాం రంగమే బ్యాక్‌బోన్‌గా మారిందని చంద్రబాబు తెలిపారు. టెలికాం రంగం నేడు అద్భుతాలు సృష్టిస్తూ ముందుకు సాగుతోందంటే దానికి ప్రధాన కారణం వాజ్‌పేయీ ప్రవేశపెట్టిన టెలికాం విధానమేనని చెప్పారు. ఆ విధానమే ఒక విప్లవానికి నాంది పలికిందన్నారు. కొంతమంది నాయకులు దేశం కోసమే ఆలోచిస్తారని, మరికొంతమంది స్వార్థం కోసం ఆలోచిస్తారని వ్యాఖ్యానించారు. వాజ్‌పేయీ చూపించిన మార్గమే సుపరిపాలన అని, అదే మార్గంలో దేశం ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.








