ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ (Sambhaji Maharaj) జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ‘ఛావా’ సినిమా (Chhaava Movie) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) మరాఠీ సాహిత్య సభలో ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. “ప్రస్తుతం దేశమంతా ‘ఛావా’ గాలి వీస్తోంది” అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రసంగంలో మహారాష్ట్ర సినీ పరిశ్రమ గొప్పతనాన్ని ప్రస్తావించారు. “ముంబై, మహారాష్ట్రలు హిందీ చిత్రసీమను ఎదిగేలా చేశాయి. ఇప్పుడు ‘ఛావా’ సినిమా శంభాజీ మహారాజ్ యొక్క పరాక్రమాన్ని మరోసారి ప్రజలకు గుర్తు చేస్తున్నది. శివాజీ సావంత్ రాసిన మరాఠీ నవల ద్వారా శంభాజీ మహారాజ్ వీరత్వం సుస్పష్టంగా ప్రజలకు తెలిసింది” అని అన్నారు.
విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాక్స్ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది.