ఒక్క పాస్‌పుస్తకం (Land Passbook) ఇవ్వడానికి ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లడం చూస్తే.. ప్రజాధనం ఎలా వృథా అవుతోందో అర్థమవుతోందని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీరుపై పేర్ని నాని (Perni Nani) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “పబ్లిసిటీ పీక్, విషయం వీక్ అన్నట్టుగా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల సమస్యలు, భూముల వివాదాలు, ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వ్యవహారం పూర్తిగా నమ్మకద్రోహమని ఆరోపించారు. ఎల్లో మీడియా చంద్రబాబుకు నిత్యం జగన్‌పై విషం కక్కేలా కథనాలు రాస్తోందని, రామకోటిలా జగన్ కోటి రాయనిదే వారికి నిద్ర పట్టడం లేదని విమర్శించారు.
రైతుల భూములపై 22A – బాధ్యుడు చంద్రబాబే
రైతుల భూములను 22Aలో పెట్టి ఇబ్బందులకు గురి చేసింది చంద్రబాబేనని పేర్ని నాని స్పష్టం చేశారు. జగన్ హయాంలో ఒక్కరి భూమిని కూడా 22Aలో పెట్టలేదని, చుక్కల భూములనూ 22Aలో చేర్చి రైతులను వేధించింది చంద్రబాబు ప్రభుత్వమేనని మండిపడ్డారు. ఇప్పుడు జగన్ ఆ సమస్యలను పరిష్కరిస్తే.. ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూడా సర్వేలకు జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థనే వాడుతున్నారని, క్యూఆర్ కోడ్ సిస్టం, కొలతలతో కూడిన పొలం మ్యాప్‌లన్నీ జగన్ తీసుకువచ్చినవేనని గుర్తు చేశారు. అయినా వాటికీ చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆరోపించారు.
పాస్‌పుస్తకం మీద జగన్ ఫోటో తీసేయడం తప్ప చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడిచ్చే పాస్‌పుస్తకాలలో కూడా కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. పాస్‌పుస్తకం మీద ఫోటో పెట్టుకోవడం నేరమా? అని నిలదీశారు.
అమరావతి రైతులకు న్యాయం చేయాలి
రాజధానిలో మొదటి విడత భూములు ఇచ్చిన రైతులకు ముందుగా న్యాయం చేయాలని, ఆ తర్వాతే రెండో విడతపై మాట్లాడాలని జగన్ కోరారని గుర్తు చేశారు. అమరావతిపై జగన్ (Jagan)కు మమకారం లేకపోతే అక్కడ ఇల్లు కట్టుకుని ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఇప్పటికీ అమరావతిలో ఇల్లు లేదని, లింగమనేని రమేష్ (Lingamaneni Ramesh) ఇంట్లో ఎందుకు ఉంటున్నారని నిలదీశారు.
పవన్ కళ్యాణ్‌పై విమర్శలు
ఏపీలో కులాలు, మతాలను రెచ్చగొట్టేది పవన్ కళ్యాణేనని (Pawan Kalyan) పేర్ని నాని ఆరోపించారు. పవన్‌ను జనం కాపు కాయాలంటారని, ఆయనేమో చంద్రబాబును కాపు కాస్తాడంటారని ఎద్దేవా చేశారు. పిఠాపురంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ఎవరు కాపు కాయాలని, దళితులను వెలివేస్తుంటే ఎవరు కాపు కాయాలని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయాలు అబద్ధాలు, డ్రామాలతో నిండిపోయాయని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే స్థాయికి వెళ్లాయని పేర్ని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.








