సూపర్ సిక్స్ పథకాలను విపరీతంగా ప్రచారం చేసిన కూటమి పార్టీలు, అధికారంలోకి రాగానే తమ పథకాల ద్వారా పూర్ పీపుల్‌ను రిచ్‌గా మారుస్తామని ప్రకటించింది. ప్రజలంతా నమ్మారు. ప్రతినెలా ఒక పథకం అందిస్తూ ఆడబ్బు నేరుగా బ్యాంక్ అకౌంట్ (DBT) లో జమ చేసే జగన్ (YS Jagan)ను కాదని, కూటమి వైపు మెజార్టీ ప్రజలు మొగ్గుచూపారు. ఎన్నికల్లో కూటమి గెలిచింది. గెలిచి ఏడు నెలలు గడిచింది. పథకాలు ఎప్పుడా అని ప్రజలంతా ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు (Chandrababu) అనూహ్యమైన ప్రకటన చేశారు. దీంతో ప్రజలంతా తలలు పట్టుకుంటున్నారు.
“సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ (Super Six) హామీలు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రాష్ట్రం ఆర్థికం (AP Economy)గా పటిష్ఠంగా ఉండాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) 15% పెరిగిన తర్వాత మాత్రమే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. “ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకాల అమలుకు ఆస్కారం లేదు. సంపద పెరగగానే రైతు భరోసా, తల్లికి వందనం వంటి పథకాలను చేపడతాం” అని వివరించారు. దీంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
మేనిఫెస్టో ముట్టని బీజేపీ..
ఎన్నికల ముందు రాజమండ్రి సభలో చంద్రబాబు సహా కూటమి నేతలంతా కలిసి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. బీజేపీ స్టేట్ ఎలక్షన్ ఇన్‌చార్జ్‌గా వచ్చిన సిద్ధార్థనాథ్ సింగ్ కనీసం ఆ మేనిఫెస్టోను తాకేందుకు కూడా ఇష్టపడలేదని వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. అంటే బాబు హామీలతో తమకేం సంబంధం లేదని ఆయన చెప్పకనే చెప్పారంటూ అప్పట్లో ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. ప్రస్తుతం చంద్రబాబు సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ పథకాలు అమలు అంటుండటంతో ఆ హామీలతో తమకేం సంబంధం లేదని బీజేపీ చేతులు దులుపుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

లెక్కలతో సహా జగన్ ప్రజెంటేషన్..
చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఆచరణకు సాధ్యపడవని, సీఎం హోదాలో జగన్ లెక్కలతో సహా ప్రజెంటేషన్ ఇచ్చారు. బాబు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయాలంటే ఏడాదికి రూ.74,284 కోట్లు కావాలని హామీల వారీగా లెక్కలతో సహా వివరించారు. ఎన్నికల సమయంలో హడావిడిగా మాటలు చెప్పేసి, ప్రజలను మోసం చేయడం తప్ప.. కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు అమలుకు నోచుకోలేవని జగన్ ఎన్నికల ముందు స్పష్టం చేశారు. వైసీపీ అమలు చేసే పథకాలకే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేస్తున్నవారంతా.. మరి ఏటా రూ.74 వేల కోట్ల పైచిలుకు ఎక్కడ నుంచి తెస్తారని జగన్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ఏడు నెలల కాలం గడిచిన తరువాత సూపర్ సిక్స్ హామీలపై సీఎం చంద్రబాబు చేతులెత్తేసే వ్యాఖ్యలపై ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలకో పథకం అందించే జగన్‌ను కాదని, కూటమిని నమ్మినందుకు తగిన శాస్తి జరిగిందని జనం గగ్గోలుపెడుతున్నారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలకు కోతపెట్టకుండా, ఆర్థిక స్థితిగతులు బాగోలేదని సాకులు చెప్పకుండా నగదు బదిలీ చేసిన జగన్ పాలనను ప్రజలు మళ్లీ గుర్తుచేసుకునే పరిస్థితిని చంద్రబాబు కల్పించారు. చంద్రబాబు తన వ్యాఖ్యలతో సూపర్ సిక్స్ పథకాలకు ఆఖరి రాగం పడేసినట్లేనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.