కృష్ణా జిల్లా (Krishna district) పెదఆవుటుపల్లి (Peda Avutupalli)లో చోటుచేసుకున్న మూడు హత్యల కేసులో దశాబ్దం గడిచినా ఇంకా న్యాయం జరగలేదని బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 2014 సెప్టెంబర్ 24న జరిగిన గంధం నాగేశ్వరరావు (Gandham Nageswara Rao), పగిడి మారియ్య (Pagidi Mariyya), మారియ్య (Mariyya) మృతికి దారితీసిన ఘటనపై అప్పటి నుంచి విచారణ సాగుతున్నా స్పష్టత లేకపోవడంతో, పినకడిమి గ్రామానికి చెందిన జ్యోతిష్కుడు (Astrologer) తూర్పాటి నాగరాజు (Toorpati Nagaraju) కుటుంబ సభ్యులు ఏపీ(AP) డీజీపీ(DGP)ని కలిసి ఫిర్యాదు చేశారు.
తూర్పాటి నాగరాజు కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, 2014లో జరిగిన మూడు హత్యల కేసుల్లో ఇప్పటి వరకు న్యాయం జరగలేదని, 2015లో హైదరాబాదులో సరూర్‌నగర్ ప్రాంతంలో నాగరాజుపై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా నాటి పోలీసుల ప్రమేయం ఉన్నట్లు వారు ఆరోపించారు. ముగ్గుర్ని హత్య చేసిన కేసు విచారణలో నిందితులు బయట తిరుగుతున్నారని, తమపై జరిగిన దాడి కేసులో న్యాయం అడిగితే కొత్త కేసులు మోపుతున్నారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ హత్యల కేసులో భూతం గోవింద్, భూతం శీను కుటుంబాలు భారీగా లంచాలు ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించారని తూర్పాటి నాగరాజు కుటుంబం ఆరోపించింది. అంతేకాకుండా, నాటి విజయవాడ, ప్రస్తుత ఏలూరు ఏఎస్పీ నక్క సూర్యచంద్రరావు జోక్యంతో మూడు కేసులలో నిందితులకు సమన్లు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని వారు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉంటే ఏఎస్పీ సూర్యచంద్రరావు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
డీజీపీని కలిసి సమగ్ర విచారణ చేయాల్సిందిగా, గత కేసులను తిరిగి తెరపైకి తీసుకురావాలని, తమపై నమోదైన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. పెదఆవుటుపల్లి కాల్పుల కేసుతో పాటు, తమపై జరిగిన హత్యాయత్నం ఘటనను న్యాయపరంగా పునర్విచారించి న్యాయం చేయాలని వారు కోరారు.








