‘రేవంత్ వ్యాఖ్యలకు మేము జవాబు చెప్పం’

రేవంత్ వ్యాఖ్యలకు మేము జవాబు చెప్పం

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని (Rayalaseema Lift Irrigation Project) తామే ఆపించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) స్పందించారు. రేవంత్ రెడ్డి మాటలకు తాము ఎందుకు జవాబు చెప్పాలంటూ ఆయన మీడియాను, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ప్ర‌శ్నించారు. ఇప్పటికే ఆ వ్యాఖ్యలకు బీఆర్ఎస్(BRS) నేత హరీష్ రావు(Harish Rao) సమాధానం చెప్పారని మంత్రి ప‌య్య‌వుల‌ జారుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి చంద్ర‌బాబు (N. Chandrababu Naidu) పేరు తీసినా, లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టును ఆపించాన‌ని చెప్పినా, కూట‌మి నేత‌లు ఆ వ్యాఖ్య‌ల‌కు మాత్రం స‌మాధానం చెప్ప‌కుండా సైలెంట్‌గా త‌ప్పించుకుంటున్నారు.

రేవంత్ వ్యాఖ్య‌ల‌పై చంద్రబాబు నాయుడు, ఆయ‌న మంత్రి వ‌ర్గం, కూట‌మి నేత‌లు నోరు విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు ఇద్దరి మధ్య ఏం ఒప్పందం జరిగిందో, తెలంగాణ ఒత్తిడికి ఎందుకు తలొగ్గాల్సి వచ్చిందో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స్పష్టత ఇవ్వకుండా త‌ప్పించుకుంటున్నార‌ని, మౌనం వెనకేదో నిగూడ ర‌హ‌స్యం దాగుంద‌ని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై స‌మాధానం చెప్ప‌క‌పోగా, సీమ‌కు లిఫ్ట్ ఎంత మేలు చేస్తుందో వివ‌రించిన మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌(Jagan)పై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నారు. రాయ‌ల‌సీమ లిఫ్ట్ వ‌ల్ల ఒరిగేదేమీ లేద‌న్న‌ట్లుగా మీడియా ముందు ప్ర‌సంగాలిస్తున్నారు.

జ‌గ‌న్ చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. రోజుకు 8 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి తెలంగాణ డ్రా చేసుకుంటుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నీళ్లు డ్రా చేసే కెపాసిటీ కేవ‌లం 0.63 టీఎంసీలు మాత్ర‌మే. మల్యాల, ముచ్చుమర్రి లిఫ్టుల ద్వారా 0.63 టీఎంసీలు డ్రా చేసుకునే కెపాసిటీ మాత్ర‌మే ఏపీకి ఉంది. శ్రీ‌శైలం ఫుల్ రిజ‌ర్వాయ‌ర్ లెవ‌ల్ 885, పోతిరెడ్డి పాడు నుంచి డిజైన్ డిశ్చార్జ్ మేర‌కు నీళ్లు ఏపీకి రావాలంటే 881 అడుగులు ఉండాలి. అప్పుడే శ్రీ‌శైలం నుంచి డ్రా చేసుకోగ‌లం. రోజుకు 8 టీఎంసీల నీరు శ్రీ‌శైలం నుంచి తెలంగాణ‌ ఖాళీ చేస్తుంటే.. ఎప్పుడు ఆ ప్రాజెక్టులో 881 నీటిమ‌ట్టం అడుగులు చేరుతుంది.. ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది, ఏపీకి నీళ్లు ఎప్పుడొస్తాయి.. ఎన్నిరోజులు వ‌స్తాయి..? అనేది వైఎస్ జ‌గ‌న్ ప్ర‌శ్న‌.

కిందున్న రాయ‌ల‌సీమ‌, నెల్లూరు ప్రాంతాల ప‌రిస్థితి ఏంట‌న్న ఆలోచ‌న చంద్ర‌బాబుకు ఉందా..? అనేది ప్ర‌ధాన‌మైన ప్ర‌శ్న‌. దీనికి రాయ‌ల‌సీమ లిఫ్ట్ ద్వారా శాశ్వ‌త ప‌రిష్కారం దొరుకుతుంద‌ని జ‌గ‌న్ ఆలోచ‌న చేసి నిర్మాణ ప‌నులు చేప‌ట్టారు. అయితే, చంద్ర‌బాబు ఈ ప్రాజెక్టుకు అసలు అవసరమే లేదన్న ధోరణిలో మాట్లాడుతున్నారని, రాయలసీమ రైతుల ఆందోళనను లెక్క చేయకుండా ప్రాజెక్టును తక్కువ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాయలసీమ లిఫ్ట్ కెపాసిటీ 34 టీఎంసీలు. వాటా ప్రకారం ఏపీకి వచ్చేది 22 టీఎంసీలు. అయితే, “ఆ ప్రాజెక్టుకు అసలు మీనింగ్ ఉందా?” అంటూ చంద్రబాబు ప్రశ్నించడం, 22 టీఎంసీల నీళ్ల వల్ల ఏం జరుగుతుంది అని వ్యాఖ్యానించ‌డం కూడా వివాదాస్ప‌దంగా మారింది. లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్ట్‌ను క్లోజ్డ్ రూమ్‌లో చంద్ర‌బాబుతో డిస్క‌ర్ష‌న్ చేసి ఆపించేశాన‌ని నిండు స‌భ‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా, రాయ‌ల‌సీమ లిఫ్ట్‌ను త‌ప్పుబ‌ట్ట‌డం, జ‌గ‌న్‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం ఏపీ ప్ర‌జ‌ల‌ను ఆలోచింప‌జేస్తోంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను చంద్ర‌బాబు తాక‌ట్టుపెట్టాడ‌నే భావ‌న ఆ ప్రాంత ప్ర‌జ‌ల్లో మెల్ల‌గా పెరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment