జనసేన ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు పిఠాపురం రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. నాగబాబు మాట్లాడుతూ.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి రెండు ప్రధాన అంశాలు పనిచేశాయని, అవి పవన్ కళ్యాణ్ మరియు పిఠాపురం ప్రజలని అన్నారు. పవన్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే, అది వారి వారి ఖర్మ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను ఉద్దేశించి చేసినవని భావిస్తూ, సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పొత్తులో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ వర్మ పిఠాపురం త్యాగం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తిపై నాగబాబు నోరుపారేసుకోవడంపై టీడీపీ మండిపడుతోంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు రాకపోవడంతో వర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల, వర్మ తన అనుచరులతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు లేకుండా నిర్వహించిన ఈ సమావేశంలో, మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీల నుంచి అనుచరులు హాజరయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో, నాగబాబు వ్యాఖ్యలు వర్మను ఉద్దేశించి చేసినవని భావిస్తూ, టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం పిఠాపురం రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారింది.