ఇటీవల జరిగిన జనసేన పార్టీ (Jana Sena Party) ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 4 దశాబ్దాలు కలిగిన పార్టీని జనసేన నిలబెట్టిందని చాలా గంభీరంగా ప్రకటించుకున్నారు. పదిహేను రోజుల్లోనే మళ్లీ మాట మార్చారు. ఆదివారం అమరావతిలో జరిగిన పీ4 కార్యక్రమంలో డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పీ4 కార్యక్రమం తెచ్చిన సీఎం చంద్రబాబు (Chandrababu) ను ఆకాశానికి ఎత్తిన పవన్.. తన పార్టీ కెపాసిటీపై వ్యాఖ్యలు చేసిన పవన్‌పై సోషల్ మీడియాలో సుదీర్ఘంగా చర్చ నడుస్తోంది.
పవన్ ఓపెన్ స్టేట్‌మెంట్..
పీ4 కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 2014 నుంచి చంద్రబాబుకు మద్దతిచ్చానంటే.. మన దగ్గర సత్తా (Strength) లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా, బలం, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకులు దగ్గర ఉన్నప్పుడు.. ఓట్లు చీలకుండా ఇస్తే ప్రజలకి బలం అవుతుందని 2014 నుంచి నేను అదే పని చేశాను. చంద్రబాబుకు మద్దతిస్తూ వచ్చాను. చంద్రబాబే సీఎంగా లేకపోయి ఉంటే పీ-4 పాలసీ బయటకి వచ్చేది కాదు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
షాక్‌లో జనసైనికులు, వీర మహిళలు
4 దశాబ్దాల పార్టీని నిలబెట్టిన పవన్.. జనసేన దగ్గర సత్తా లేదని, అందుకే బాబుకు మద్దతిచ్చానని (Supported) ఓపెన్‌గా ప్రకటించడంపై ఆ పార్టీ సైనికులు, వీర మహిళలు అవాక్కయ్యారు. ఇన్నాళ్లూ ప్రభుత్వ ఏర్పాటు పవనే కారణమని చెప్పుకుంటూ కాలర్ ఎగరేస్తున్న జనసైనికులంతా పవన్ కళ్యాణ్ స్టేట్‌మెంట్‌తో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. పవన్ ప్రకటనతో టీడీపీ (TDP) శ్రేణులు రెచ్చిపోతున్నారు.
ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు తనకు, తన పార్టీకి సత్తా లేదని ప్రకటించడంతో పొలిటికల్ అనలిస్టులు (Political Analysts) కూడా షాక్ అవుతున్నారు. వేరొక పార్టీ నాయకుడి కోసం తన, తన పార్టీ సామర్థ్యాన్ని తక్కువ చేసి ఇంత వరకు ఏ పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన దాఖలాలు లేవంటున్నారు. చంద్రబాబు కోసం సొంత పార్టీతో పాటు తన ప్రతిష్టను దిగజార్చుకోవడం (Compromising) పవన్ కళ్యాణ్‌కే చెల్లిందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.