ప‌వ‌న్ ప్రొడ్యూస‌ర్లు చంద్ర‌బాబు, లోకేష్ – కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ప‌వ‌న్ ప్రొడ్యూస‌ర్లు చంద్ర‌బాబు, లోకేష్ - కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని సినిమా నటనతో పోలుస్తూ.. “ప్రొడ్యూసర్ డబ్బులు పెడితే యాక్టింగ్ చేసే యాక్టర్ పవన్ కల్యాణ్” అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి.

2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు సరైన ప్రొడ్యూసర్ దొరకక ఒక్క సీటు కూడా గెలవలేదని అనిరుధ్ రెడ్డి ఎద్దేవా చేశారు. అయితే 2024 ఎన్నికల్లో ప్రొడ్యూసర్‌గా చంద్రబాబు, కో–ప్రొడ్యూసర్‌గా నారా లోకేష్ దొరకడంతోనే పవన్ గెలిచారని విమర్శించారు. రాజకీయాల్లో కూడా ఆయన “పవర్ స్టార్” కాదని, “ప్యాకేజీ స్టార్”గా పేరు తెచ్చుకున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్ మంథ్లీ ప్యాకేజీ తీసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని, అది సరిపోక ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్‌గా ప్రధాని మోడీని తీసుకొచ్చారని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. ఈసారి ప్యాకేజీ మరింత పెద్దదైందని, అయినా సరే, తెలంగాణలో 50 సీట్లు కూడా గెలవలేరని జోస్యం చెప్పారు.

తెలంగాణ ప్రజలపై పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా అనిరుధ్ రెడ్డి గుర్తు చేశారు. “తెలంగాణ ప్రజల కళ్లు మంచివి కావని అన్నార‌ని, కోన‌సీమ కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలింద‌ని చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు పవన్ క్షమాపణ చెప్పలేదని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారని ప్రశ్నించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భూముల‌కు రేట్లు లేవ‌ని, తెలంగాణలోని విలువైన భూముల కోసమే ఆంధ్ర నాయ‌కులు రాజకీయ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. మొత్తానికి, పవన్ కల్యాణ్ రాజకీయాలపై అనిరుధ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు జనసేన, పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment