తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది పర్వదినం (Ugadi Festival) రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వ అధికారిక వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొని పంచాంగ శ్రవణం చేశారు. అయితే, ఈ వేడుకల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సనాతన ధర్మం అంటే ఇదేనా?
పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తనను తాను ‘సనాతన ధర్మ పరిరక్షకుడిగా’ (Protector of Sanatana Dharma) గట్టిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. హిందూ ధర్మం (Hindu Religion), సంప్రదాయాల పట్ల తరచుగా ప్రసంగాలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తి, తెలుగు వారి అతిపెద్ద పండుగైన ఉగాది రోజున కనీసం పంచాంగ శ్రవణంలో కూడా పాల్గొనకపోవడంపై జనసేన కార్యకర్తల్లోనే అంతర్మథనం మొదలైంది.
గతంలో వినాయక చవితి (Vinayaka Chavithi) వంటి ముఖ్యమైన పర్వదినాల్లో కూడా పవన్ కళ్యాణ్ బహిరంగంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. “ఆధ్యాత్మికత గురించి మాట్లాడే మన నాయకుడు, ఇలాంటి ముఖ్యమైన పండుగ రోజున ఎందుకు కనిపించడం లేదు?” అని స్వయంగా జనసైనికులే అంతర్గత చర్చల్లో ప్రశ్నించుకుంటున్నారు.
వైసీపీ ఎదురుదాడి.. జనసైనికుల మౌనం!
గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) పండుగలు జరుపుకునే తీరుపై, ఆలయాల సందర్శనపై జనసైనికులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసేవారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్‌పై ప్రయోగిస్తున్నాయి. “పక్కా సనాతని అని చెప్పుకునే పవన్, ఉగాది పండుగను ఎందుకు విస్మరించారు? పక్క రాష్ట్రాల్లో ఉన్నారా లేక షూటింగుల్లో బిజీగా ఉన్నారా?” అంటూ వైసీపీ మద్దతుదారులు నిలదీస్తున్నారు. జగన్ విషయంలో నానా యాగీ చేసిన జనసైనికులు, ఇప్పుడు తమ నాయకుడి గైర్హాజరీపై కనీసం వివరణ ఇచ్చుకోలేక మౌనంగా ఉండిపోవడం గమనార్హం.
బాధ్యత మరిచారా?
ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి, అధికారికంగా జరిగే పంచాంగ శ్రవణానికి రాకపోవడం పరిపాలనాపరంగా కూడా చర్చకు దారితీస్తోంది. వ్యక్తిగత కారణాలా లేక సినిమా షూటింగ్‌లలో బీజీగా ఉన్నారా అన్నది పక్కన పెడితే, ఉగాది వంటి సందర్భాల్లో ప్రజల మధ్య ఉండకపోవడం పవన్ ఇమేజ్‌కు కొంత మైనస్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.








