శ్రీలంక ఓపెనర్, యువ సంచలనం పథుమ్ నిస్సంక ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు. తొలి టెస్ట్‌లో భారీ శతకంతో (187 పరుగులు) చెలరేగిపోయిన నిస్సంక, ప్రస్తుతం కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో కూడా అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.
రెండో రోజు ఆటలో భాగంగా, నిస్సంక 167 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అతను 102 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉండగా, అతనికి జతగా దినేశ్ చండీమల్ (59 పరుగులు) క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి, శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 1 వికెట్ నష్టానికి 204 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్‌లో లహిరు ఉడారా 40 పరుగులు చేసి తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఔటయ్యాడు.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్
ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసిన బంగ్లాదేశ్, రెండో రోజు కేవలం 27 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 2 వికెట్లను కోల్పోయింది.
బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (46) టాప్ స్కోరర్‌గా నిలవగా, మొమినుల్ హక్ (21), ముష్ఫికర్ రహీం (35), లిటన్ దాస్ (34), మెహిది హసన్ మిరాజ్ (31), నయీమ్ హసన్ (25), తైజుల్ ఇస్లాం (33) రెండంకెల స్కోర్లు చేశారు. అనాముల్ హక్ 0, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8, ఎబాదత్ హొసేన్ 8 పరుగులకు ఔటయ్యారు.
శ్రీలంక బౌలర్ల విజృంభణ
బంగ్లా ఇన్నింగ్స్‌ను శ్రీలంక బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు. అశిత్ ఫెర్నాండో (3 వికెట్లు), విశ్వ ఫెర్నాండో (2 వికెట్లు), సోనల్ దినుష (3 వికెట్లు) అద్భుతంగా రాణించారు. ధనంజయ డిసిల్వ, తిరండు రత్నాయకే చెరో వికెట్ పడగొట్టారు.
తొలి టెస్ట్ డ్రా, నాలుగు సెంచరీలు
కాగా, బంగ్లాదేశ్ జట్టు శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. ఈ పర్యటనలో గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించారు. ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్‌ల్లో (148, 125 నాటౌట్) సెంచరీలు చేయగా, ముష్ఫికర్ రహీం (163), మరియు పథుమ్ నిస్సంక (187) తమతమ తొలి ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించారు.