మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతోంది. డబ్బు (Money), ఆస్తుల (Property’s) మీదున్న మమకారం జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తోబుట్టువులపై ఉండడం లేదు. నేలకు కొడితే పగిలిపోయే సెల్‌ఫోన్‌కు ఇచ్చే విలువ కూడా కన్నవారికి ఇవ్వని దారుణమైన పరిస్థితులు దాపురించాయి. మానవ సంబంధాలకు పాతరేసిన సంఘటన తాజాగా పల్నాడు (Palnadu) జిల్లా యడ్లపాడు మండలం సొలసలో చోటుచేసుకుంది.
సొలసలో జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలం చేసిన కన్నతండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కన్నబిడ్డలు ముందుకు రాలేదు. తండ్రి సంపాదించిన ఆస్తి పంపకాల నేపథ్యంలో కుమారులు, కుమార్తెల మధ్య వివాదం నెలకొంది. దీంతో తండ్రి భౌతికకాయాన్ని రోడ్డున వదిలేసి ఆస్తి కోసం కొట్టుకున్నారు.
మూడ్రోజుల క్రితం అనారోగ్యంతో గువ్వల ఆంజనేయులు (Guvvala Anjaneyulu) (80) అనే వృద్ధుడు మృతిచెందాడు. సమాచారం అందుకున్న కుమార్తెలు, కుమారులు స్వగ్రామం సొలస చేరుకున్నారు. మృతుని పేరుపై 6 ఎకరాల పొలం, ఒక ఇల్లు ఉంది. ఆస్తి పంపకాల విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో దహన సంస్కారాలకు ఇద్దరు కుమారులు, కుమార్తెలు నిరాకరించారు. అంత్యక్రియలు చేయాలని పోలీసులు చెప్పినా కన్నబిడ్డల వైఖరి మారలేదు. ఆంజనేయులు మృతదేహం రోడ్డుకే పరిమితమైంది. దీంతో గ్రామ పెద్దలు, పోలీసుల జోక్యం చేసుకోవడంతో చిన్న కుమారుడు అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కోట్ల రూపాయలున్నా కష్టమే.. ఆస్తుల కోసం కొడుకులు, కూతుళ్లు ఇలా తయారయ్యారేంట్రా అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.







