పాకిస్తాన్‌లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఉగ్రముప్పు పొంచి ఉందని పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే ఆరు మ్యాచ్‌లు జరగ్గా, వాటిల్లో రెండు దుబాయ్‌లో జరిగాయి. భారత్-బంగ్లా, భారత్-పాక్ మ్యాచ్‌లు రెండూ దుబాయ్ వేదికగా జరిగాయి.
చాలా ఏళ్ల తరువాత పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగా, ట్రోర్నమెంట్‌ను చూసేందుకు విదేశీయులు రాక మొదలైంది. కాగా, విదేశీయులు లక్ష్యంగా చేసుకొని కిడ్నాప్ చేయాలని ఇస్లామిక్ స్టేట్ కుట్ర చేస్తున్నట్లు పాక్ ఇంటెలిజెన్స్ తెలిపింది. చైనా, అరబ్బులను టార్గెట్ చేసినట్లుగా సమాచారం. పాకిస్తాన్‌లోని ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు, ఆఫీసులు, ఖరీదైన నివాస ప్రాంతాలపై ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ నిఘా వేసిందని ఇంటలిజెన్స్ వెల్లడించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రముప్పు వార్త విదేశీయులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.