భారత మాజీ క్రికెటర్లు పాకిస్థాన్‌తో తలపడాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసుకోవడంపై పాకిస్థాన్ (Pakistan) మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ (Salman Butt) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత క్రికెటర్లకు నిజంగా దేశభక్తి ఉంటే ఇకపై ఏ స్థాయిలోనూ పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడకూడదని, అంతేకాకుండా ఒలింపిక్స్ (Olympics) సహా ఏ క్రీడలోనూ పోటీ పడకూడదని సవాల్ విసిరాడు.
గత ఆదివారం (జులై 20) వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) లీగ్‌లో భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మాజీ క్రికెటర్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. యువీ సేన, అఫ్రిది సారథ్యంలోని పాక్ జట్టుతో తలపడాల్సి ఉండగా, పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడికి (Terror Attack) నిరసనగా భారత మాజీ క్రికెటర్లు ఈ మ్యాచ్‌ను ఆడకూడదని నిర్ణయించుకున్నారు. ఈ ఆకస్మిక రద్దు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ పరిణామంపై స్పందించిన సల్మాన్ బట్ తన ఆక్రోశం వెళ్లగక్కాడు. “ఇకపై టీమిండియా పాకిస్థాన్‌తో వరల్డ్ కప్, ఒలింపిక్స్‌లో కూడా తలపడదని ప్రమాణం చేయాలి. అప్పుడు వారి దేశభక్తి ఏ పాటిదో చూస్తాను” అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. భారత్-పాకిస్థాన్ సంబంధాలపై కేవలం క్రికెట్ విషయంలోనే చర్చ జరుగుతుందని, ఇతర క్రీడల్లో ఈ సమస్య ఉండదని కూడా అతను పేర్కొన్నాడు.
నిజానికి, పాకిస్థాన్ క్రికెటర్లు భారత్‌తో మ్యాచ్‌ల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఆర్థికంగా వెనుకబడిన పాకిస్థాన్‌కు భారత్‌తో మ్యాచ్‌లు ఆడితే గణనీయమైన ఆదాయం లభిస్తుంది. భారత్-పాక్ మ్యాచ్‌లకు ఉండే క్రేజ్, దాని ద్వారా లభించే స్పాన్సర్‌షిప్‌లు, యాడ్ రెవెన్యూ, బ్రాడ్‌కాస్టింగ్ ఆదాయం కోసం పాక్ క్రికెటర్లు ఆరాటపడుతుంటారు. సల్మాన్ బట్ ఆగ్రహానికి ఇది కూడా ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ రద్దు చేయడంపై భారత క్రికెట్ అభిమానులు మాజీ ఆటగాళ్లను ప్రశంసించారు. వాస్తవానికి, ఈ టోర్నీలో ఇరు దేశాలు తలపడతాయని తెలియగానే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత క్రికెట్ అభిమానుల నుంచి వచ్చిన ఒత్తిడి, విమర్శల కారణంగానే ఈ మ్యాచ్ రద్దు అయినట్లు తెలుస్తోంది.