తెలుగు సినీ పరిశ్రమలో హాస్యానికి చిరునామాగా నిలిచిన నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మశ్రీ’ (Padma Shri) పురస్కారం ఆయన జీవితంలో మరిచిపోలేని ఘట్టంగా మారింది. ఈ గౌరవం తన వ్యక్తిగత విజయం కాదని, తెలుగు హాస్యానికి, వినోదాన్ని ఆదరించే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఆయన స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తనకు ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించడం తన జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు అని చెప్పారు. ఇది తన పూర్వజన్మ సుకృతం అని, ఈ గౌరవం తనకు మాత్రమే దక్కిందని అనుకోవడం లేదని, తెలుగు హాస్యానికి, ప్రేక్షకుల ప్రేమకు లభించిన గౌరవంగా భావిస్తున్నానన్నారు.
కళలను గౌరవించి, తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అసలు కారణం ప్రేక్షకులే. గత 48 ఏళ్లుగా నేను చేసిన ప్రతి పాత్రకు, ప్రతి ప్రయోగానికి ప్రేక్షకులు అందించిన ప్రేమే ఈరోజు నాకు ఇంతటి గుర్తింపును తీసుకొచ్చింది” అని భావోద్వేగంగా చెప్పారు.
తనను ఒక నటుడిగా మాత్రమే కాకుండా, ఇంటి మనిషిలా ఆదరించి ‘నటకిరీటి’(Natakireeti)గా మలిచిన ప్రేక్షకుల చప్పట్లే తన నిజమైన సంపదని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. “నాలాంటి నటుడిని ఈ స్థాయికి తీసుకువచ్చిన మీ ప్రేమకు, అభిమానానికి నేను జీవితాంతం ఋణపడి ఉంటాను. ఆ ఋణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను” అన్నారు. “నన్ను ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండమని దీవించిన మీ అందరికీ మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను” అంటూ రాజేంద్రప్రసాద్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.







