పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో భారత వైమానిక దళం (Indian Air Force – IAF) చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” (Operation Sindhoor) విజయవంతం అయ్యిందని రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. భారత వైమానిక దళం, నేవీ, ఆర్మీ సంయుక్త సమన్వయంతో ఈ ఆపరేషన్ జరగగా, ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా దాడులు నిర్వహించామని ఎయిర్ మార్షల్ ఏకే భారతి (Air Marshal A.K. Bharathi) తెలిపారు. “మా పోరాటం పాక్ సైన్యంపై కాదు, కానీ ఉగ్రవాద శిబిరాలపై” అని స్పష్టంచేశారు. ప్రజలకు హాని కలగకుండా, అత్యంత కచ్చితంగా ఈ దాడులు జరిగాయని పేర్కొన్నారు.
ఉగ్రవాదుల శిబిరాలు లక్ష్యంగా..
”ఆపరేషన్ సిందూర్ గురించి పలు కీలక అంశాలను ఎయిర్ మార్షల్ ఏకే భారతి వివరించారు. మా యుద్ధం పాకిస్తాన్ సైనికులపై కాదు కానీ, పాకిస్థాన్ వాళ్లపై దాడి చేస్తున్నట్టు భావిస్తోంది. పాకిస్థాన్ సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం చేయలేదు. పాకిస్థాన్ వైపు నుంచి దాడులను సమర్ధంగా తిప్పికొట్టాం. మన సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశాం. పాక్ భూభాగంలో జరిగిన నష్టానికి పాక్ ఆర్మీదే బాధ్యత. అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థతో పాక్ క్షిపణులు, డ్రోన్లను తిప్పికొట్టాం. చైనా తయారీ పీఎల్ – 15 క్షిపణిని నేలకూల్చాం. ఉగ్రవాదులు కొన్నేళ్లుగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నారు. సైనికులనే కాకుండా, యాత్రికులను, భక్తులను టార్గెట్ చేస్తున్నారు. 9, 10 తేదీల్లో పాక్ మన వైమానిక స్థావరాలను టార్గెట్ చేసింది.. కానీ, మన డిఫెన్స్ వ్యవవస్థతో వాటిని అడ్డుకున్నాం. మల్టీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకొని పాక్ మన వైమానిక స్థావరాలను ధ్వంసం చేయలేకపోయింది. స్వదేశీ తయారీ ఆకాశ్ ను సమర్ధంగా వినియోగించాం.
ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (Akash Air Defence System) ఎంతో అద్భుతంగా పనిచేసింది. లాంగ్ రేంజ్ మిస్సైల్ ను సైతం శత్రువుపై ఉపయోగించాం. లాంగ్ రేంజ్ మిస్సైల్ తో చైనీస్ మేడ్ డ్రోన్లను కూల్చాం. మాకు ఎలాంటి నష్టం జరగకుండా శత్రువును దెబ్బతీసే స్ట్రాటజీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ఉపయోగించాం. సరిహద్దు దాటకుండా ఉగ్రవాదులపై కచ్చితమైన దాడి చేశాం. పాక్ దాడులు మా ఎయిర్ గ్రేడ్ సిస్టమ్ ను దాటలేకపోయాయి. ఒకవైపు పాక్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేస్తూనే మా ఎయిర్ బేస్ లను సురక్షితం చేశాం. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సమన్వయంతో పనిచేశాయి. పాక్ పై అనుక్షణం భారత నావికాదళం నిఘా ఉంటుంది. పాక్ కదలికలను భారత నావికాదళం పరిశీలిస్తోంది. పాకిస్థాన్ లో ఎలాంటి అణు స్థావరాలను లక్ష్యం చేయలేదు. పాకిస్థాన్ లోని కిరాణ హిల్స్ పై దాడి చేయలేదు. పాకిస్థాన్ లోని కిరాణ హిల్స్ లో ఏముందో మాకు తెలియదు” అని ఏకే భారతి వివరించారు.
ఆ శక్తి పాక్‌కు లేదు : DGMO రాజీవ్ ఘాయ్
డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) రాజీవ్ ఘాయ్ (Rajeev Ghai) మాట్లాడుతూ.. BSF జవాన్లు వారి బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించారని చెప్పారు. సరిహద్దుల వద్ద అమాయక ప్రజలపై పాక్ దాడులకు తెగబడిందన్నారు. పహల్గామ్ లో అమాయక పర్యాటకులను చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్ ను ముందే సిద్ధం చేశామన్నారు. ఆపరేషన్‌లో ఇండియన్ ఎయిర్ ఢిఫెన్స్ బలమైన గోడలా నిలిచిందన్నారు. అత్యాధునిక ఆయుధాలతో పాక్ పై విరుచుకుపడ్డామని, బహుళ రక్షణ వ్యవస్థను అధిగమించే శక్తి పాక్ కు లేదన్నారు. పహల్గామ్ పాపానికి మూల్యం చెల్లించుకున్నారన్నారు. భారత సైనిక స్థావరాలపై దాడి చేయడం అసాధ్యమని, త్రివిధ దళాల (Tri-Services) మధ్య సంపూర్ణ సమన్వయం ఉందని చెప్పారు.
ఉగ్రవాద అంతానికే.. వైస్ అడ్మిరల్ ప్రమోద్
పాకిస్తాన్‌ను ఎదుర్కునేందుకు నేవీ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందని వైస్ అడ్మిరల్ ప్రమోద్ తెలిపారు. ఫైటర్, నిఘా విమానాలు నిత్యం కాపలా కాస్తున్నాయని చెప్పారు. అత్యాధునిక రాడార్లతో నిఘావ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుందని చెప్పారు. తమ పోరాటం ఉగ్రవాదుల అంతానికేనని, పాక్ ఆర్మీ, ప్రజలపై కాదని ప్రమోద్ మరోసారి స్పష్టం చేశారు.








