ఆప‌రేష‌న్ iBomma.. విడాకుల‌కు వ‌చ్చి దొరికిపోలేద‌ట‌!

ఆప‌రేష‌న్ iBomma.. విడాకుల‌కు వ‌చ్చి దొరికిపోలేద‌ట‌

తెలుగు సినిమా పైరసీ ప్రపంచంలో ప్రధాన పాత్రధారిగా పేరుగాంచిన iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేయడంతో కేసు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఎందుకంటే ఐ-బొమ్మ కేవ‌లం తెలుగు ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన కేసు మాత్ర‌మే కాదు.. తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలూ బాధితులే. నిందితుడు రవిని పట్టుకున్న వెంటనే, అతడి ద్వారా iBomma, Bappam TV వెబ్‌సైట్లను వెంట‌నే క్లోజ్ చేయించినట్లు తెలుస్తోంది. గ‌తంలో రవి విసిరిన స‌వాల్‌ను సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు ఆప‌రేష‌న్ iBomma ను చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ట్లుగా వారి చ‌ర్య ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అరెస్ట్ అనంతరం పోలీసులు రవి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వందల హార్డ్‌డిస్కులు, సర్వర్ డేటా, దేశీయ–అంతర్జాతీయ బ్యాంక్ ఖాతా లావాదేవీలను సవివరంగా పరిశీలిస్తున్నారు. అతడి బ్యాంక్ అకౌంట్‌లోని రూ.3 కోట్లను స్వాధీనం చేసుకున్న‌ట్లు సమాచారం. రవిని మరింతగా విచారించేందుకు అవసరమని భావించిన పోలీసులు, సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

కొన్ని మీడియా కథనాల్లో ఇమ్మడి రవి భార్యతో విడాకులు తీసుకుంటూ దొరికిపోయాడు అని ప్రచారం జరిగినా, అది పూర్తిగా అవాస్తవమని తెలుస్తోంది. రవి తన భార్యతో ఐదేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నాడు. ఈ కేసుతో ఆ విషయం సంబంధం లేదని చెబుతున్నారు. అతడు ఇటీవల ఒక బెట్టింగ్ యాప్ నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు బయటపడటం, దర్యాప్తులో కీలక లీడుగా మారింది.

ఆ ట్రాన్సాక్షన్ జరిగిన ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేసిన పోలీసులు, అది ముసాపేటలోని విస్టా అపార్ట్‌మెంట్స్‌కు చెందినదని గుర్తించి రవిపై నిఘా పెట్టారు. ఇదే నేపథ్యంలో, రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ నుండి రవి తిరిగి రాగానే ఎయిర్ పోర్టులోనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌తో తెలుగు పైరసీ నెట్‌వర్క్‌ను బట్టబయలు చేసే దిశగా దర్యాప్తు వేగం పెరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment