కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ONGC డ్రిల్ సైట్ (ONGC Drill Site) వద్ద జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన (Gas Leakage Incident) తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. డ్రిల్ సైట్ నుంచి భారీగా గ్యాస్ లీకై బయటకు చిమ్ముతుండగా, కొద్దిసేపటి తర్వాత మంటలు ఆకాశాన్ని తాకేలా, ఇరుసుమండ పరిసరాల్లో భీకర శబ్దాలతో మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. దీంతో చుట్టుపక్కల 5 కి.మీ. పరిధిలో ఉన్న ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మంటల తీవ్రత కారణంగా ఇప్పటివరకు సుమారు వెయ్యి కొబ్బరి చెట్లు పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ (Mahesh Kumar) సంఘటనా స్థలానికి చేరుకుని బ్లో అవుట్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కలెక్టర్ వివరణ ప్రకారం, 1993 నుంచి ఆపరేషన్‌లో ఉన్న ఒక వెల్‌లో బ్లో అవుట్ సంభవించింది. 2024లో ఈ వెల్‌ను “డీప్” (DEEP Company) అనే కంపెనీకి సబ్ లీజ్ ఇచ్చారు. 2,500 మీటర్ల లోతులోని ఒక లేయర్లో ఎక్స్ప్లరేషన్ కోసం ప్రయత్నిస్తుండగా అనూహ్యంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అంచనాలకంటే ఎక్కువ పరిమాణంలో గ్యాస్ ఒక్కసారిగా బయటకు తన్నుకొని వచ్చింది.
ప్రారంభంలో సుమారు ఒక గంటపాటు గ్యాస్ మాత్రమే బయటకు వచ్చినప్పటికీ, మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో గ్యాస్‌కు మంటలు అంటుకున్నాయి. సంఘటనా స్థలంలో సుమారు 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల వరకు గ్యాస్ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
భద్రత దృష్ట్యా ఒక కిలోమీటర్ పరిధిలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ONGC ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, వెల్‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం వెల్‌ను పూర్తిగా నియంత్రించేందుకు మరో 24 గంటల వరకు పట్టే అవకాశం ఉందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో కోనసీమ జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.








