‘ఓం శాంతి శాంతి శాంతిః’.. మూవీ రివ్యూ

‘ఓం శాంతి శాంతి శాంతిః’.. మూవీ రివ్యూ

డైరెక్ట‌ర్ కం యాక్ట‌ర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ నేడు జనవరి 30న థియేటర్లలోకి వచ్చింది. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘జయ జయ జయ జయహే’ సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆ ఒరిజినల్ మూవీ రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఆ సినిమా తెలుగు ఆడియోతో ఓటీటీలో అందుబాటులో ఉండటంతో, అదే కథను రీమేక్ చేయడం పెద్ద సవాలుగానే మారింది. మరి తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.

కథ ఏమిటంటే..
శాంతి (ఈషా రెబ్బా) చిన్ననాటి నుంచే తన కలలతో జీవించే అమ్మాయి. చదువుకుని మంచి ఉద్యోగం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఇంటర్ తర్వాత నగరానికి వెళ్లి చదువుకోవాలని కోరుకున్నా, తల్లిదండ్రుల అంగీకారం లేక దగ్గర్లోని కాలేజీలో డిగ్రీ చేయాల్సి వస్తుంది. కాలేజీలో జరిగిన ఒక సంఘటన కారణంగా చదువును మధ్యలోనే ఆపి పెళ్లి చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

ఈ క్రమంలో నాయుడు (తరుణ్ భాస్కర్) శాంతి జీవితంలోకి వస్తాడు. పెళ్లయ్యాక చదివిస్తానని మాట ఇవ్వడంతో ఆమె పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ వివాహానంతరం నాయుడులోని అసలైన పురుషాహంకారం బయటపడుతుంది. చిన్నచిన్న విషయాలకే శాంతిపై చేయి చేసుకోవడం మొదలుపెడతాడు. తల్లిదండ్రులకు చెప్పినా ‘సర్దుకుపో’ అనే సమాధానమే వినిపిస్తుంది.

ఒక దశలో భర్తకు ఎదురుతిరిగిన శాంతి, అతడిని కొట్టే వరకు వెళ్లడం కథలో కీలక మలుపు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంఘటన తర్వాత వారి జీవితంలో ఏం జరిగింది? విడాకుల దాకా పరిస్థితి ఎలా వెళ్లింది? ఆత్మహత్య ఆలోచన నుంచి శాంతి ఎలా బయటపడింది? అన్నదే మిగతా కథ.

సినిమా ఎలా ఉందంటే..
స్త్రీలను గౌరవించాలనే సందేశాన్ని బలంగా చెప్పే చిత్రమిది. నేటి సమాజంలో ఆడపిల్లలపై ఉండే ఆంక్షలు, కుటుంబాల్లో జరిగే వివక్ష, పెళ్లి తర్వాత చదువు–ఉద్యోగాల విషయంలో ఎదురయ్యే అవమానాలను దర్శకుడు నిజాయితీగా చూపించాడు. శాంతి పాత్రలో చాలా మంది మధ్యతరగతి అమ్మాయిల ప్రతిబింబం కనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్‌లో కథ సహజంగా సాగుతూ ప్రేక్షకులను కథలోకి లాగుతుంది. అయితే సెకండ్ హాఫ్‌లో కొంత నెమ్మదిగా అనిపించినా, గృహహింసపై చెప్పిన పాయింట్లు ఆలోచింపజేస్తాయి. “భర్త కొడితే సహజం, భార్య తిరగబడితే అవమానమా?” అనే ప్రశ్నను బలంగా లేవనెత్తింది ఈ సినిమా.

క్లైమాక్స్‌లో జడ్జి చెప్పే మాటలు ప్రత్యేక ఆకర్షణ. ఒక భార్య భర్త నుంచి కోరుకునేది స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం మాత్రమేనని, అవి అడగాల్సినవి కాదని – పుట్టుకతోనే వస్తాయని చెప్పిన తీరు చప్పట్లకు కారణమవుతుంది.

నటీనటుల ప్రదర్శన
ఈ సినిమాలో అసలైన హీరో ఈషా రెబ్బా అని చెప్పాలి. శాంతి పాత్రలో ఆమె నటన హృదయాన్ని తాకుతుంది. ఓర్పు, సహనం నుంచి తిరుగుబాటు వరకు అన్ని ఎమోషన్లను సహజంగా పలికించింది. తరుణ్ భాస్కర్ రాయుడు పాత్రలో అద్భుతంగా నటించాడు. తనలోని నటుడిని మరోసారి నిరూపించుకున్నాడు.

ఓవ‌రాల్‌గా ఎలా ఉందంటే..
సంక్రాంతి తర్వాత కుటుంబంతో కలిసి చూసేందుకు సరైన సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతిః’. వినోదంతో పాటు సమాజానికి అవసరమైన బలమైన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం ఈ చిత్రం చేసింది. ఒరిజినల్ చూసినవారికీ, చూడనివారికీ కూడా ఒకసారి చూసేలా చేసే కంటెంట్ ఇందులో ఉంది.

రేటింగ్ : 2.5

Join WhatsApp

Join Now

Leave a Comment