ఎన్టీఆర్‌-నీల్ సినిమా కోసం రూ. 15 కోట్లతో ఇంటి సెట్

ఎన్టీఆర్‌-ప్రశాంత్ నీల్ సినిమా కోసం రూ. 15 కోట్ల ఇల్లు సెట్

‘దేవర’ బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్) అని పేరు పెట్టారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై కళ్యాణ్‌రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఒక భారీ యాక్షన్ సీన్, అలాగే రెండు వేల మందితో ఒక పాటను చిత్రీకరించినట్లు సమాచారం.

తాజాగా, ఈ చిత్రం కోసం హైదరాబాద్ సమీపంలోని ఒక స్టూడియోలో ఏకంగా పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో ఎన్టీఆర్ ఇంటి సెట్‌ను నిర్మించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సెట్‌లో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారు.

సినిమాలో ఈ ఇంటి సెట్ ఒక ప్రధాన ఆకర్షణగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. కళాఖండాలు, వాల్ హ్యాంగింగ్స్ వంటి ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సెట్‌కే ఇంత భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చిన ఎన్టీఆర్, వినాయక చవితి తర్వాత సెప్టెంబర్ మొదటి వారం నుంచి కొత్త షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ చిత్రం 2026, జూన్ 25న విడుదల కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment