ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడిమిర్ జెలెన్‌స్కీ ఉత్తరకొరియా సైనికుల పరిస్థితిపై మరోసారి తన గళం విప్పారు. రష్యా తరఫున యుద్ధరంగంలో పాల్గొనేందుకు వచ్చిన ఉత్తరకొరియా సైనికులకు కనీస రక్షణ లేకుండా వారిని యుద్ధంలో నెడుతున్నారని జెలెన్‌స్కీ తీవ్ర ఆరోపణలు చేశారు.
“ఉత్తరకొరియా సైనికులలో చాలా మందిని మా సైన్యం బంధించింది. అయితే, వారిలో గాయపడిన వారు చికిత్స పొందే అవకాశం లేక మరణించారు” అని జెలెన్‌స్కీ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ వెల్లడించిన కొన్ని కీలక సమాచారానికి కొనసాగింపుగా కనిపిస్తాయి.
సైనికుల మరణాలు..
దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాడిన దాదాపు 1,000 ఉత్తరకొరియా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం 3,000 మంది దాకా ఉత్తరకొరియా సైనికులు యుద్ధంలో పాల్గొన్నారని జెలెన్‌స్కీ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. జెలెన్‌స్కీ ఈ విషయంలో వ్యక్తం చేసిన బాధ, ఉత్తరకొరియా సైనికుల విషయంలో రష్యా తీరుపై ఆగ్రహం, అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.