ఉత్తర కొరియా(North Korea) మరోసారి అమెరికాపై(United States) కఠిన వైఖరిని తీసుకుంది. సోమవారం ఆ దేశ సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) పార్లమెంట్లో(Parliament) ప్రసంగిస్తూ అమెరికాను ఒక “ఉగ్రవాద” దేశంగా(Terrorist Country) అభివర్ణించారు. ఉత్తర కొరియా తన అణ్వాయుధాలను(Nuclear Weapons) ఎప్పటికీ వదులుకోదని మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించే ప్రయత్నాల్లో అమెరికా ఇప్పటికే నిమగ్నమై ఉన్న తరుణంలో కిమ్ జోంగ్ ఉన్ ఈ ప్రకటన చేశారు.
కిమ్ జోంగ్ ఉన్ తన ప్రసంగంలో ఇరాన్(Iran) పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్(Israel) జరిపిన దాడులనే ఉద్దేశించారు. దేశ భద్రతకు అణ్వాయుధాలు అవసరమని.. ఈ ఆయుధాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడమన్నారు. అమెరికా సైనిక విధానాలు శాంతికి ముప్పు అని కిమ్ విమర్శించారు. శాంతియుత జీవిస్తూనే, శత్రువుల దాడులపై ప్రతిస్పందించాలని పిలుపునిచ్చారు. తమ శత్రువులను తిప్పికొట్టేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని కిమ్ అన్నారు.
తన ప్రసంగంలో కిమ్ జోంగ్ ఉన్ దక్షిణ కొరియాను(South Korea) తన అతిపెద్ద శత్రువుగా అభివర్ణించారు. ఉత్తర కొరియా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే ఏ ప్రయత్నం చేసిన తాను నిర్దాక్షిణ్యంగా ప్రతిస్పందిస్తానని సియోల్‌ను హెచ్చరించారు. కొంతకాలం క్రితం, కిమ్ జోంగ్ ఉన్ దక్షిణ కొరియా వైపు పలు క్షిపణులను సైతం ప్రయోగించారు. మరోవైపు.. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కిమ్ జోంగ్ ఉన్ను కలవాలనే తన కోరికను వ్యక్తం చేశారన్నది గమనించదగ్గ విషయం. అయితే, ట్రంప్‌ను కలవడంలో కిమ్ జోంగ్ ఉన్‌కు పెద్దగా ఆసక్తి లేదని ప్రకటన సూచిస్తోంది. అంతేకాకుండా, ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో, ఉత్తర కొరియా ఇప్పుడు తన సైనిక శక్తిని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది.








