పెట్రోలింగ్ వెహికిల్స్ లేవా..? అందుకే నడిపించారా..?

పెట్రోలింగ్ వెహికిల్స్ లేవా..? అందుకే నడిపించారా..?

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో నిందితులను నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఘటనలపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta) ఇచ్చిన వివరణ రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. న్యూఇయర్ సందర్భంగా 2025 క్రైమ్ రౌండప్ వివరాలను వెల్లడించిన డీజీపీ(DGP), రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ తగ్గిందని, అయితే సోషల్ మీడియా కేసులు, సైబర్ నేరాలు పెరిగాయని తెలిపారు.

ఈ ప్రెస్‌మీట్ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వైసీపీ శ్రేణులను అరెస్ట్ చేసి, కొట్టి, రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లిన వీడియోలు వైరల్ కావడంపై జాతీయ మీడియాకు చెందిన ఓ జర్నలిస్ట్ డీజీపీని ప్రశ్నించారు. “డీకే బసు వర్సెస్ పశ్చిమ బెంగాల్ కేసులో నిందితులను బహిరంగంగా ఊరేగించకూడదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉల్లంఘిస్తున్నారని అంగీకరిస్తారా?” అని నిలదీశారు.

దీనికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. “లేదు… నిందితులను కోర్టుకు తీసుకెళ్లడానికి మా దగ్గర పెట్రోలింగ్ వాహనాలు (Patrolling Vehicles) లేవు. అందుకే వారిని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాం. మేము కూడా నడుస్తూ పెట్రోలింగ్ చేస్తున్నాం. న‌వ్వుతూ ధన్యవాదాలు” అంటూ స్పందించారు. ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

డీజీపీ సమాధానంపై సోషల్ మీడియాలో తీవ్ర సెటైర్లు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “కనీసం అద్దె కార్లలో అయినా నిందితులను కోర్టుకు తీసుకెళ్లలేరా?, ఉద్దేశపూర్వకంగానే నిందితుల‌ను రోడ్ల మీద నడిపించి, తర్వాత వాహనాలు లేవని సమాధానం చెప్పడం ఏంటి?” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

“కోర్టు డ్యూటీకి వాహనాలు లేవంటారు… కానీ డిప్యూటీ సీఎం‌కు ప్రోటోకాల్ లేకపోయినా ముందు నాలుగు కార్లు, వెనుక నాలుగు పోలీస్ వాహనాలు ఎందుకు తిరుగుతున్నాయి?” అంటూ నిలదీస్తున్నారు. వాహనాలే లేవంటే వీఐపీ కాన్వాయ్‌లు ఎలా తిరుగుతున్నాయి? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి.

సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలతో పాటు, డీజీపీ స్థాయి వ్యక్తి ఈ విధంగా సమాధానం ఇవ్వడం సరైనదేనా? అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment